సమంత, చైతన్యల‌ వెబ్‌ సిరీస్‌ల సంగతేంటి.. ? ఎందుకు ఏ అప్డేట్ లేదు.. ?

ఏంటీ నాగచైతన్య, సమంత కలిసి వెబ్ సిరీస్ చేశారా? ఎప్పుడు చేశారు అనే డౌట్ మీకు కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం ఇద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్ అని కాదు. ఇద్దరూ వేరువేరుగా చేసిన వెబ్ సిరీస్ లు అన్నమాట. వరుస సినిమాలు చేసిన సమంత ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది. నాగచైతన్య కొత్త సినిమా పనులు మొదలు పెట్టాడు. అయితే కొన్ని నెలల క్రితం వీరు చేసిన వెబ్ సిరీస్ లు ఏమయ్యాయి.. ఇంకా ఎందుకు రిలీజ్ కాలేదు అనేదే ఇక్కడ ప్రశ్న. మీకు గుర్తుండి ఉంటే.. నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

‘దూత’ అనే పేరుతో ఆ వెబ్ సిరీస్‌ తెరకెక్కించారు. హారర్‌ – థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఆ వెబ్‌ సిరీస్‌ చాలా నెలల క్రితమే పూర్తయింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇక సమంత ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే ” సిటడెల్ ” సిరీస్ తెరకెక్కించారు. దీని సంగతి కూడా ఇంకా ఏమి తెలియడం లేదు. పోనీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇన్నేళ్లు సమయం తీసుకున్నారా అంటే ఆ కథలు అలాంటివి కావు కూడా. దీంతో ఏమైందా అని ప్రశ్న మొదలైంది. ” దూత ” వెబ్ సిరీస్ గురించి అయితే చర్చించుకోవడం స్టార్ట్ చేసి ఏడాది అయ్యింది.

గతేడాది దసరాకు ఈ సిరీస్ ను తీసుకొస్తామని చెప్పారు. ఈ విజయదశమి కూడా వెళ్ళిపోయింది. ఇక ప్రియాంక చోప్రా ” సిటడెల్ ” తేడా కొట్టడంతో సామ్ న‌టించిన ఇండియన్ ” సిటడెల్ ” లైట్ తీసుకున్నారు అనే పుకారు వినిపిస్తుంది. వీటన్నిటికీ మించి ఈ రెండు సిరీస్ లను నిర్మించిన అమెజాన్ ప్రైమ్ ఆలోచనలు మారిపోయాయి అని చెబుతున్నారు. ఓటీటీలు, వెబ్ సిరీస్ ల బూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సిరీస్ లను టీమ్ ఓకే చెప్పిందని.. ఇప్పుడు సిరీస్ లకు అంతా ఆదరణ లేదు అని అంటున్నారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లు ఆ వెబ్ సిరీస్ లను హోల్డ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్.