నిన్న ( అక్టోబర్ 19) బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ” భగవంత్ కేసరి ” రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడని తమ అభిమానులకి అర్థం అయిపోయింది. ఇక బాలయ్య అభిమానులకు చిరంజీవి అభిమానులకు ఎల్లప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కాదా… ఈ సినిమాను చూసిన మెగా అభిమాని సినిమాపై రివ్యూ ఇచ్చాడు.
ప్రస్తుతం మెగా అభిమాని ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను రివ్యూ ఏ విధంగా ఇచ్చాడు ఇప్పుడు చూద్దాం. ” ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. టికెట్ తీసి లోపలకు వెళ్లి కుర్చీలో కూర్చున్న చాలా సమయం వరకూ సాదాసీదాగానే అనిపించింది. హీరో ఎంట్రీ కూడా మామూలుగానే అనిపించింది. ఆ ఎంట్రీ హీరో స్థాయికి తగ్గట్టు లేదేమో అనిపించేసింది. ఇంటర్వల్ సమయం దగ్గర పడుతోంది. హీరో మార్క్ నాకైతే కనిపించలేదు ఆ స్థాయిలో.
దర్శకుడి శైలి కూడా కనిపించలేదు. ఇంకా బాగుంటే బాగుండేమో అనిపించింది. అప్పుడు వచ్చింది ఒక ఫైట్ సీన్ దులిపేసే ఫైట్ సీన్. సినిమా రూపాన్నే మార్చేసిన ఫైట్ సీన్ అది. పులిని తక్కువ అంచనా వేసిన గుంట నక్కల మీదకు అదే పెద్ద పులి పడి ఆ నక్కల మెడలను కొరికేస్తూ ప్రక్కకు విసిరేస్తే ఎలా ఉంటదో ఆ ఫైట్ సీన్ అలా ఉంటది. అక్కడి నుండి సినిమాలోకి లీనం అయిపోతాడు ప్రేక్షకుడు. ఈసారి కాస్త విభిన్నమైన కథతోనే బాలయ్య బాబు వచ్చాడు.
అతని స్థాయికి తగ్గ కథ. సీనియర్ హీరోలు మాత్రమే మోయగలిగే కథ. బాలయ్య బాబు అంటేనే బహుశా పూనకం వచ్చేస్తుందేమో తమన్ కి… ప్రాణం పెట్టేశాడు అతను. అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గుండెలు అదిరిపోతాయి. అనిల్ రావిపూడి గారు బాలయ్య బాబు కోసం సినిమా చేస్తే. బాలయ్య బాబు ఆడబిడ్డల ధైర్యానికి సంబంధించిన అంశం కోసం సినిమా చేశారు. చాలా హాస్య ప్రధాన సినిమాలు తీసిన దర్శకుడు ఇంతలా యాక్షన్ పండించే సన్నివేశాలు కూడా తీయగలిగాడా అన్నంతలా దర్శకుడి ప్రతిభ ఈ సినిమాలో కనిపిస్తుంది.
ఆడబిడ్డలకు హాని చేస్తున్న ఉన్మాదపు అంశాల పట్ల ధైర్యంగా, నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా బాలయ్య బాబు చేతనే సమాజానికి పాఠం చెప్పించేశాడు దర్శకుడు. ఆ దృశ్యం చూసిన ప్రతి ప్రేక్షకుడూ కంట నీరు పెట్టుకోవడం ఖాయం. గుండెలకు హత్తుకునే దృశ్యాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా పండించడం బాలయ్య బాబుకి కొట్టిన పిండి.
శ్రీలీల మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. సెంటిమెంట్ సన్నివేశాల్లో బాలయ్య బాబుతో పోటీపడి నటించింది ఆమె. మాటలు బాగా కుదిరాయి. బలంగా పడ్డాయి సన్నివేశాలకు తగ్గట్టు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ధైర్యం నూరిపోసి తమ కాళ్ళ మీద తామే నిలబడే స్థాయిలో పెంచాలన్న అంశం అందరినీ ఆకట్టుకుంటుంది ” అంటూ మెగా అభిమాని రివ్యూ ఇచ్చాడు.