ఇదేం ఘోరం గోవిందా..?

అవును పాపం భూమన అనాల్సిందే. ఏ మూహుర్తంలో రెండోసారి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఫిక్స్‌ అయిందో కానీ.. ఆ సమయం ఆయనకు అంతగా కలిసి వచ్చినట్టు లేదు. తిరుమల కొండపై చిరుత ఓ చిన్నారిని చంపేయడమనే హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. సంఘటన చాలా బాధాకరం. అయితే ఆ తర్వాత జరిగిన ఘటనలు.. తీసుకున్న నిర్ణయాలు.. చేసిన కామెంట్లు ఇప్పుడు భూమనను ట్రోల్స్‌కు గురి చేయడంతో పాటు.. మొత్తంగా ప్రభుత్వాన్నే డామేజ్‌ చేస్తున్నాయి. చిన్నారిని చిరుత చంపేసిన తర్వాత అందరిలోనూ ఓ చర్చ జరిగింది. మెట్ల మార్గంలోకి చిరుతలు రాకుండా ఫెన్సింగ్‌ వేయొచ్చు కదా అని సామాన్యంగా అందరూ అనుకునేదే. కానీ దానికి టీటీడీ నుంచి విచిత్ర సమాధానం వచ్చింది. తాము ఫెన్సింగ్‌ వేయడానికి సిద్దంగానే ఉన్నాం.. కానీ దీనికి అటవీ, పర్యావరణ అనుమతులు కావాలని చెప్పింది టీటీడీ. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫెన్సింగ్‌ వేయడానికి అనుమతులు గురించి మాట్లాడుతున్న టీటీడీ.. జింకలకు ఫెన్సింగ్‌ ఎలా వేసింది..? అని సాక్షాత్తూ మృత్యువాత పడ్డ చిన్నారి తాతయ్యే ప్రశ్నించాడు. దీనికి టీటీడీ కానీ.. భూమన కానీ ఏం సమాధానం చెప్పగలరు..?

అలాగే రుషికొండ మీద పర్యావరణ అనుమతులు పూర్తి స్థాయిలో లేకుండానే భారీ కట్టడాలు కట్టేస్తూ.. దాన్ని సమర్ధించుకుంటున్న ఈ సందర్భంలో భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా ఫెన్సింగ్‌ కట్టే విషయంలో ఎందుకింత ఆలోచన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీటీడీ చెప్పినట్టు ఫెన్సింగ్‌ వేయడానికి సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉండి ఉండొచ్చు గాక.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీడీ ఈ విధంగా స్పందించకుండా ఉంటే బాగుండేదని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ఇక ఏదైనా ప్రమాదం జరగడం ఆలస్యం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసి.. మేం ఘనంగా ఆ కుటుంబానికి న్యాయం చేసేశాం అని చెప్పుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

చిన్నారి మృత్యువాత పడిన వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ చిన్నారి తాతయ్య. ఆ పాపపు సొమ్ము మాకు అక్కర్లేదన్నారు. భక్తులను నడక మార్గం ద్వారా కాకుండా.. బస్సు మార్గం ద్వారానే వచ్చేలా చేసి ఆదాయాన్ని పెంచుకునే దారులు వెతుక్కుంటున్నారని పెద్ద కామెంటే చేశారు. ఇది భక్తులను ఆలోచింప చేసే విధంగా ఉంది. పైగా చనిపోయిన తర్వాత ఎంతిచ్చి ఏం లాభం.. కోటి రూపాయలిచ్చినా.. తమ బిడ్డ తిరిగి రాదుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఓ రకమైన తిరుగుబాటుగానే చూడాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో చిరుతలను తరమడానికి.. దాడి చేసే చిరుతలను ఎదుర్కొవడానికి ఊతకర్ర ఇవ్వాలన్న నిర్ణయం అభాసుపాలైంది. చిరుతలను తరమడానికి ఊత కర్ర ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎవ్వరికీ అంతు చిక్కని విధంగా ఉంది. చిరుత లాంటి మృగం నుంచి తమను తాము కాపాడుకోవడానికి కర్ర సాయం ఏంటో అర్థం కాక.. కరుణాకర్‌ రెడ్డిని.. కర్రణాకర్‌ రెడ్డి అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు నెటిజన్లు. భక్తుల ప్రాణాలను కాపడ్డనికి ఫెన్సింగ్‌ వేయమంటే ఊత కర్ర ఇవ్వాలనే నిర్ణయం ఎవరిదో కానీ వారిని ఓసారి మీడియా ముందు ప్రవేశపెట్టాలని సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ విధంగా కరుణాకర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించీ.. స్వీకరించకముందే అభాసు పాలయ్యారు.