ఆసక్తికరంగా చీరాల రాజకీయం….!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం చీరాల. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నియోజకవర్గం ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారనేది ఇప్పటికీ అంతు చిక్కని మాట. అక్కడ అన్ని సామాజికవర్గాలది కీలక పాత్ర. యాదవ, ఆర్యవైశ్య, కాపు, కమ్మ సామాజిక వర్గాల నేతలు గెలుస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ విజయం సాధించలేదు. దీంతో ఈ సారి గెలుపు కోసం వైసీపీ, టీడీపీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.

1999లో టీడీపీ తరఫున పాలేటి రామారావు, 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొణిజేటి రోశయ్య, 2009లో ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 2014లో నవోదయం పార్టీ పేరుతో కొత్తగా పార్టీ పెట్టిన ఆమంచి… మరోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీ జెండా కప్పుకున్నారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఆమంచి వైసీపీలో చేరడంతో… 2019లో ఫ్యాన్ గుర్తు కింద పోటీ చేశారు. ఇక 2019లో చివరి నిమిషంలో కరణం బలరాం బరిలోకి దిగడంతో… 5 వేల తేడాతో టీడీపీ విజయం సాధించింది. ఆయితే అనూహ్యంగా కరణం వైసీపీ తీర్ఖం పుచ్చుకున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున బలరాం కుమారుడు వెంకటేశ్ పోటీ చేయడం దాదాపు ఖాయం. నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆమంచిని పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ప్రకటించారు. అయినా కృష్ణమోహన్ మాత్రం చీరాల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భం లేదు. ఇదే సమయంలో ఆమంచి సోదరుడు స్వాములు జనసేన పార్టీలో చేరారు. తమ్ముడికి అండగా ఉన్న స్వాములు… ఈ సారి తానే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు కుదురుతే… చీరాల నుంచి స్వాములు అభ్యర్థి అని ఆయన వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. కృష్ణమోహన్ కూడా రాబోయే ఎన్నికల్లో చీరాల నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే.. మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అదే జరిగితే… నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ ఖాయమంటున్నారు విశ్లేషకులు.