కంచుకోటలపై పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..సైకిల్ జోరు!

రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట…అలాగే కోస్తా చివరిలో..రాయలసీమకు దగ్గరలో ఉండే ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సైతం వైసీపీకి పట్టున్న జిల్లాలు గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ హవానే నడుస్తోంది. సీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం..ఈ ఉమ్మడి జిల్లాలని తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ జిల్లాలుగా చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పు రాయలసీమ అంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాలు…అటు పశ్చిమ రాయలసీమ అంటే కడప-కర్నూలు-అనంతపురం జిల్లాలు.

2014 ఎన్నికల్లో రెండు చోట్ల వైసీపీ హవానే. 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు. రెండు చోట్ల వైసీపీ భారీ ఆధిక్యంలో గెలిచింది. ఈ ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేసింది. ఇక ప్రకాశంలో 12 సీట్లు ఉంటే వైసీపీ 8 సీట్లు గెలిచింది. చిత్తూరులో 14 సీట్లు ఉంటే 13 గెలిచింది. అనంతలో 14 సీట్లు ఉంటే 12 సీట్లు గెలిచింది. అంటే ఏ స్థాయిలో అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు.

అలాంటి కంచుకోటల్లో ఇప్పుడు వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి టీడీపీ చెక్ పెట్టింది. అనూహ్యంగా భారీ మెజారిటీ తేడాతో టి‌డి‌పి నుంచి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. ఇక పశ్చిమ రాయలసీమ స్థానంలో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. వైసీపీకి టి‌డి‌పి గట్టి పోటీ ఇస్తుంది. కేవలం 1500 లోపు మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి ఉన్నారు.

ప్రస్తుతం అక్కడ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ఈ ఓట్లలో టీడీపీకి ఆధిక్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వైసీపీకి ఇంకా భారీ షాక్ తప్పదని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పట్టభద్రులు..టీడీపీకే మెజారిటీ కట్టబెట్టారు.