ఎమ్మెల్సీ పోరు: ఆధిక్యంలో టీడీపీ..వైసీపీకి షాక్ తప్పదా?

ఏపీలో ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల స్థానిక సంస్థల కోటాలో  నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలని వైసీపీ కైవసం చేసుకుంది. అయినా ప్రతి జిల్లాలో స్థానిక అభ్యర్ధులు వైసీపీకి 90 శాతం వరకు ఉన్నారు. దీంతో సులువుగా ఆ స్థానాలని కైవసం చేసుకుంది. టి‌డి‌పి కూడా పోటీకి నిలవలేదు. ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో నిలిచారు.

అయినా విజయం వైసీపీనే వరించింది. ఇక తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. పి‌డి‌ఎఫ్ అభ్యర్ధులు రెండోస్థానంలో కొనసాగుతున్నారు. ఇక అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థాంల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానంలో టి‌డి‌పి అభ్యర్ధి వేపాడ చిరంజీవి రావు అందరికీ అందనంత ఆధిక్యంలో ఉన్నారు. నాల్గవ రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్ధి సీతంరాజుపై దాదాపు 20 వేల ఓట్లపైనే మెజారిటీతో టి‌డి‌పి అభ్యర్ధి కొనసాగుతున్నారు.

అటు తూర్పు రాయలసీమ అంటే..ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఎమ్మెల్సీ స్థానంలో కూడా టి‌డి‌పి అభ్యర్ధి కంచర్ల శ్రీక్రాంత్ దాదాపు 16 వేల ఓట్లపైనే మెజారిటీతో ఉన్నారు. అక్కడ నాల్గవ రౌండ్ పూర్తి అయింది. ఇక పశ్చిమ రాయలసీమ అంటే..కడప-కర్నూలు-అనంతపురం ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్ధి రవీందర్ రెడ్డి కేవలం 1943 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఉన్నారు. రెండోస్థానంలో టి‌డి‌పి ఉంది. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి టి‌డి‌పి గట్టి షాక్ ఇచ్చేలా ఉంది.