ప్రకాశం వైసీపీలో సెగలు..సొంతవాళ్లే ఓడిస్తామని!

వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే.  సాధారణంగా అధికార పార్టీల్లో కాస్త ఆధిపత్య పోరు ఉంటుంది. కానీ వైసీపీలో అది ఎక్కువగానే ఉంది. దాదాపు చాలా స్థానాల్లో ఆధిపత్య పోరు కనిపిస్తుంది. నేతల మధ్య రచ్చ నడుస్తోంది. మామూలుగానే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..కానీ ఎమ్మెల్యేలని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకించడం వైసీపీలోనే జరుగుతుంది.

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే తామే ఓడిస్తామని సొంత నేతలు మాట్లాడుతున్న పరిస్తితి. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ నేతలు గ్రూపు కట్టారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌కు మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేతలు సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి అసమ్మతి నాయకులతోపాటు సుమారు 250 మంది వరకు హాజరయ్యారు. వీరంతా ఎమ్మెల్యే అవినీతిని, పార్టీ కార్యకర్తలకు ఆయన చేసిన అన్యాయాల గురించి మాట్లాడారు.

పార్టీశ్రేణులకు జరిగిన అన్యాయాలు, అవమానాలకు బదులుగా బుర్రాను ఓడించి తీరుతామంటూ బహిరంగంగా చెప్పారు. బుర్రాకే సీటు కేటాయిస్తే బహిరంగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇస్తామని అంటున్నారు.

అటు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు వ్యతిరేకంగా వైసీపీ కమ్మ నేతలు పావులు కదుపుతున్నారు. వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమను నిర్లక్ష్యం చేస్తే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తీర్మానించారు. మొత్తానికి రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలే పనిచేసేలా ఉన్నారు.