పొత్తులో ఎత్తులు..సీట్ల లెక్కపై ట్విస్ట్‌లు!

టీడీపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. పవన్ ఏమో పొత్తు ఉందనే చెప్పినట్లు కనిపిస్తున్నారు గాని.. ఉందని గట్టిగా చెప్పలేని పరిస్తితి. ఇటు టీడీపీ ఏమో పొత్తులపై సరైన సమయంలో స్పందిస్తామని అంటుంది. దీంతో పొత్తు పై పూర్తి క్లారిటీ రావడం లేదు. కానీ పొత్తు దాదాపు ఉండేలా ఉంది. అదే సమయంలో సీట్లపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

అవి ఎవరు సృస్తిస్తున్నారో గాని..ఎవరు లెక్కలు వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. జనసేనకు కేవలం 20 సీట్ల వరకే ఇస్తారని ప్రచారం వస్తుంది. అయితే ఈ ప్రచారం టి‌డి‌పి శ్రేణులు చేయడం లేదు. అసలు పొత్తుల లెక్కల గురించి టి‌డి‌పి శ్రేణులు పెద్దగా మాట్లాడటం లేదు. కానీ టి‌డి‌పి-జనసేన పొత్తు చెడగొట్టాలని చూస్తున్న వైసీపీనే ఇలాంటి ప్రచారం చేస్తుందని చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు అనుకూల మీడియాగా ఉన్న ఓ చానల్..జనసేనకు 88 అసెంబ్లీ సీట్లు, 12 ఎంపీ సీట్లు..టి‌డి‌పికి 87 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి అని ప్రచారం చేస్తుంది.

అసలు ఈ లెక్క మాత్రం కరెక్ట్ కాదు..40 శాతం ఓటు బ్యాంకు ఉన్న టి‌డి‌పికి 87 సీట్లు, 10 శాతం వరకు ఉన్న జనసేన 88 సీట్లు ఏంటి అని టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రచారం చేసుకోవడానికైనా కాస్త రియాలిటీ దగ్గరగా ఉండాలని అంటున్నారు. అయితే అసలు లెక్క మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.

ఎందుకంటే ఇంతవరకు చంద్రబాబు-పవన్ కూర్చుని పొత్తులపై మాట్లాడుకోలేదు. ఆ విషయం స్వయంగా పవన్ చెప్పారు. తాను ఇంతవరకు సీట్లపై మాట్లాడలేదని, కాబట్టి బయట ప్రచారం జరిగేవి నమ్మవద్దని అన్నారు. మరి చూడాలి ఈ పొత్తుల లెక్కలు ఎప్పుడు తేలుతాయో.