ప్రముఖ నటి శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రియల్ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం ‘కబ్జా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రియ మీడియాతో తన అనుభవాలను పంచుకుంది.
శ్రియకి ధైవ భక్తి ఎక్కువట. ఈ అమ్మడికి శ్రీకృష్ణుడు ఇష్టమైన దైవమట. ఆయన సంకల్పం లేనిదే ఏదీ జరగదని అనిపిస్తుంటుందని ఆమె చెప్పింది. ఇండస్ట్రీలో ఆమె ప్రయాణం ఒకరకంగా సాఫీగా సాగిందట. “గెలుపోటములు సహజం. అన్నిటినీ సమంగా తీసుకోవాలి! ప్రతి రోజూ ఏదో ఒక అవకాశం వస్తుందని దానిని మనం ఉపయోగించుకోవాల”ని శ్రియ చెప్తుంది. ఇటీవల ఆర్. చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్రతో కలిసి నటించింది శ్రియ. ఆమె తన కెరీర్లో మరో మంచి సినిమాగా కబ్జా నిలిచిపోతుందని అంటున్నారు.
అయితే కష్టపడే తత్వం శ్రియ తన అమ్మనుంచి నేర్చుకున్నారట. అలానే ఆమె స్నేహితులు, అసిస్టెంట్లు, వర్కర్లు అందరూ తనకు ఇన్స్పైరింగ్ గా ఉంటారట. ఇక శ్రియ కూతురు రాధ కూడా తనకి స్ఫూర్తినిస్తుందని శ్రియ అంటున్నారు. కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో ఆమె బిడ్డ పడే తపన చూసి శ్రియకి ముచ్చటేస్తుందట. కూతురు పుట్టిన తరువాత శ్రియలో చాలా మార్పులు వచ్చాయట. అమ్మదనంలోని గొప్పదనాన్ని ప్రతిక్షణం ఆమె అనుభవిస్తున్నారట. తెల్లవారుతూనే రెండు చిట్టిచేతులు ఆమె ముఖాన్ని తడుముతుంటాయట. కండ్లు తెరిచేసరికి ముసిముసి నవ్వులతో చందమామలా ముందుంటుందట రాధ. శ్రియ తన కూతురు ఆమె సంతోషాన్ని పెంచడంతోపాటు ఆమె ఓపికనూ రెట్టింపు చేసిందట . తనను చూసినప్పుడల్లా తల్లిగా తన బాధ్యతలు గుర్తొస్తాయి అని శ్రీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరించారు.