కొత్త కాంబినేషన్‌తో పవన్..సెట్ చేస్తారా?

చాలా రోజుల తర్వాత సినిమాల్లో బిజీగా గడుపుతూ వచ్చిన పవన్ కల్యాణ్..ఏపీ రాజకీయాల్లో కనిపించారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉన్న నేపథ్యంలో..మార్చి 11 నుంచి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో వరుస పెట్టి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన బీసీ నేతలతో సమావేశం నిర్వహించగా, ఆదివారం కాపు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఆవిర్భావ సభకు సంబంధించిన అంశాలపై నేతలతో చర్చిస్తారు.

ఈ క్రమంలో ఆయన కుల సమీకరణాల విషయంలో కొత్త కాంబినేషన్ తో రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం కమ్మ, రెడ్డి వర్గాలే అధికారం అనుభవించాయని, కానీ ఏపీలో అత్యధికంగా ఉన్న బీసీలు, కాపులు మాత్రం అధికారం అనుభవించలేదని, ఏదో వారికి చిన్నాచితక పదవులు మాత్రమే వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కాపులు-బీసీలు కలిసి రాజ్యాధికారం సాధించాలని తాజాగా బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అలాగే ఆయన కాపు నాయకుడుని కాదని, అన్నీ కులాలకు నాయకుడుని అని చెప్పుకొచ్చారు. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యమని, ఈ కాంబినేషన్ ఉంటే ఎవరిని దేహీ అని అడగాల్సిన అవసరం లేదని, రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే.. పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెప్పుకొచ్చారు.

ఇలా బీసీ-కాపు కాంబినేషన్ తో పవన్ పోలిటికల్ గా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు దళిత వర్గాలని కూడా కలుపుకుని అధికారం సాధించాలని అంటున్నారు. కానీ జనసేనకు ఉన్న బలంతో ఇప్పుడు అధికారం కష్టం. టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాల్సిందే. అయితే జనసేన ఆవిర్భావ సభ రోజున పవన్..పొత్తులపై కొంతమేర క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.