పవన్ ఫుల్ క్లారిటీతో..వైసీపీ అనుకున్నది జరగదా!

ఎట్టకేలకు పొత్తులపై జనసేన అధినేత పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. ఇక బీజేపీకి దాదాపు గుడ్ బై చెప్పేసి..టీడీపీతో కలవడానికి ఆయన రెడీ అయిపోయారని తెలుస్తోంది. తాజాగా మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో ఆయన పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగదని చెప్పేశారు. అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకోకూడదని వైసీపీ చూస్తుంది.

వైసీపీ అనుకున్నదే జరగదని చెప్పేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోంది అని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒకటి కోరుకుంటోందని, కానీ అది జరగనివ్వనని, ఏం జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో తనకు తెలుసని, అదే జరుగుతుందని చెప్పుకొచ్చారు.  ఓటును వృథా కానివ్వనని, వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన సంతకం ఉంటుందని, తాను, జనసేన తరఫున నిలబడే అభ్యర్థులంతా అసెంబ్లీలో ఉంటారని అన్నారు.

మీరు సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నారని, కానీ మీరంతా జనసేనకు అండగా ఉంటామని సంపూర్ణమైన నమ్మకం వచ్చి… క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని, అధ్యయనం చేసి, జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్లడానికి తాను వెనుకాడనని అన్నారు.  బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడి నాయకులే ముందుకు రావడంలేదని, ఒక లాంగ్‌ మార్చ్‌ పెడతాం అన్నానని, బలోపేతమవుదామని చెప్పానని, అందుకు ఢిల్లీలో ఒప్పుకున్నారని, సాయంత్రానికి అదేంలేదని బీజేపీ నేతలు అన్నారని చెప్పుకొచ్చారు.

టీడీపీ మీద తనకు ప్రత్యేక ప్రేమ లేదని, చంద్రబాబు మీద ఆరాధనా భావం లేదని,  కానీ ఆయనమీద గౌరవముంది…ఆయన సమర్థుడు అని అన్నారు. మొత్తానికి బీజేపీని వదిలేసి టి‌డి‌పితో జట్టు కట్టడానికి పవన్ సిద్ధమయ్యారనే చెప్పవచ్చు. దాదాపు టి‌డి‌పి-జనసేన పొత్తు ఖాయమైందనే చెప్పవచ్చు.