ఆస్కార్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఫస్ట్ స్పీచ్‌.. క్రెడిట్ అంతా వాళ్ల‌కే ఇచ్చేశాడు!

ఇటీవ‌ల లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో 95వ‌ అకాడమీ అవార్డ్స్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడ‌క‌లో మ‌న తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఒక ఇండియ‌న్ సినిమాకు ద‌క్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ సినీ ప్రియులంద‌రూ `ఆర్ఆర్ఆర్` టీమ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ఆస్కార్ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న ఫ‌స్ట్ స్పీచ్ ఇచ్చాడు. తాజాగా ఆయ‌న విశ్వ‌క్ సేన్ హీరోగా తెర‌కెక్కిన `దాస్ కా ధ‌మ్కీ` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ఫాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆస్కార్ రావ‌డానికి రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌, రాహుల్‌, కాలభైరవ, ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్ పాటు యావత్‌ తెలుగు చలనచిత్ర సీమ, భారతీయ చిత్ర సీమ మ‌రియు ప్రేక్షక దేవుళ్లే కార‌ణమంటూ క్రెడిట్ మొత్తం వాళ్ల‌కే ఇచ్చేశారు ఎన్టీఆర్‌.

అలాగే `ఆస్కార్‌ అవార్డు సాధించింది, ఆ సినిమాకి పనిచేసిన మేము కాదు, మాతోపాటు మీరు సాధించారు. స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్‌ ని ఆస్కార్ అవార్డును అందుకోవ‌డం చూస్తుంటే, వాళ్లు కనిపించలేదు, ఇద్దరు భారతీయులు కనిపించారు. ముఖ్యంగా ఇద్దరు తెలుగు వాళ్లు కనిపించారు. ఆ టైమ్ లో ఆ స్టేజ్‌ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. ఆ మ‌ధుర క్ష‌ణాల‌ను రెండు కళ్లతో చూడటం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఆ క్ష‌ణాలు మున్ముందు వస్తుందో రాదో తెలియదు, కానీ, రావాలని బ‌లంగా కోరుకుంటున్నా` ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.