ఎమ్మెల్సీ పోరు..వైసీపీకి ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ.!

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసిన విషయం తెలిసినే. మూడు పట్టభద్రులు, రెండు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ, టి‌డి‌పి, పి‌డి‌ఎఫ్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే అధికార వైసీపీ..పూర్తిగా వైసీపీ బలాన్ని ఉపయోగించి..ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఇక దొంగ ఓట్లు ఏ స్థాయిలో పడ్డాయో తెలిసిందే. మరి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

ఇక ఈ నెల 23న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 7 స్థానాలకు వైసీపీ అభ్యర్ధులని కూడా ప్రకటించింది. అయితే ఊహించని విధంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధని బరిలో దింపారు. అంటే ఇక్కడ వైసీపీ 6 స్థానాలని సులువుగానే గెలుచుకోగలదు. కానీ 7వ స్థానంలో పోటీ ఉంటుంది. ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 22 ఎమ్మెల్యేలు కావాలి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇక టి‌డి‌పి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే సైతం వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. దీంతో వైసీపీ బలం 156 అవుతుంది. కానీ ఇటీవల వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. వీరే కాకుండా ఇంకా ఇద్దరు, ముగ్గురు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

అదే జరిగితే వైసీపీకి ఇబ్బంది అవుతుంది..అదే సమయంలో విప్ జారీ చేయడం వల్ల అటు టి‌డి‌పి రెబల్ ఎమ్మెల్యేలు గాని వైసీపీకి ఓటు వేస్తే రిస్క్ తప్పదు. ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలది అదే పరిస్తితి.