గుడివాడ-గన్నవరంల్లో బాబు-చినబాబు పోటీ..వంశీ సవాల్!

తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి అదే పార్టీ నుంచి రెండుసార్లు గెలిచి..ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి..తమదైన శైలిలో చంద్రబాబు-లోకేష్‌లని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏ స్థాయిలో తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలా తిడుతున్న ఈ ఇద్దరి నేతలకు చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. కానీ అనుకున్న విధంగా వారి స్థానాల్లో టి‌డి‌పి బలపడటం లేదు. అందుకే దమ్ముంటే గుడివాడ, గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయొచ్చుగా అని వంశీ సవాల్ చేశారు.

తనను, కొడాలి నానిని ఓడించాలంటే చంద్రబాబు ముత్తాత తరం కూడా కాదని, ఎవరో ఎందుకు?, గుడివాడ, గన్నవరంల్లో చంద్రబాబు, నారా లోకేషే తమపై పోటీ చేయొచ్చుగా అంటూ వంశీ సవాల్ విసిరారు. ఇక చంద్రబాబు కుప్పం కోటే బీటలు వారిందని, ముందు దాని గురించి పట్టించుకోవాలని, కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిందని గుర్తు చేశారు.

ఇవే ఫలితాలు 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని,  సీట్లు ఇంకా పెరుగుతాయని, తానూ తెలుగుదేశం స్కూల్ లోనే చదువుకున్నానని, వారి గురించి తనకు తెలియదా? అని ప్రశ్నించారు. మొత్తానికి గుడివాడ, గన్నవరంల్లో చంద్రబాబు, లోకేష్ వచ్చి పోటీ చేసిన గెలుపు తమదే అనే ధీమాలో కొడాలి, వంశీ ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే ఆ రెండు చోట్ల టి‌డి‌పి వీక్ గానే కనిపిస్తోంది. బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే..కొడాలి, వంశీలకు తిరుగులేకుండా పోయింది. మరి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమైనా స్ట్రాటజీ మారుస్తారేమో చూడాలి.