తిరుపతి సీటుపై జనసేన పట్టు..టీడీపీ తగ్గట్లేదు.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే జనసేనకు టి‌డి‌పి కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటినుంచే జనసేనకు ఇచ్చే సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది.

ఎందుకంటే 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి చిరంజీవి గెలిచారు. ఇక 2014లో టి‌డి‌పి గెలవగా, 2015 ఉపఎన్నికల్లో టి‌డి‌పి భారీ మెజారిటీతో గెలిచింది. 2019 ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్లు లోపు మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేనకు 20 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే తిరుపతిలో అప్పుడే వైసీపీ ఓడిపోయేది. అయితే ఈ సారి రెండు పార్టీలు కలిసి పోటీకి రెడీ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే జనసేన తిరుపతి సీటుపై ఆశలు పెట్టుకుంది. పొత్తు ఉంటే ఈ సీటు తమకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ బలంగా ఉన్న ఈ సీటుని వదులుకోవడానికి టి‌డి‌పి రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక్కడ సుగుణమ్మ, నరసింహ యాదవ్‌లు సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో గ్రూపు వివాదాల వల్ల పార్టీ ఓడిపోయిందని, ఈ సారి నేతలు కలిసికట్టుగా పనిచేసి తిరుపతిలో టి‌డి‌పి జెండా ఎగరవేయాలని టి‌డి‌పి సీనియర్ బీదా రవిచంద్ర యాదవ్ అంటున్నారు.

ఇక టి‌డి‌పి జెండా ఎగరవేయాలని అనడంపై జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అంటే ఈ సీటు పొత్తులో భాగంగా తమకు ఇవ్వడం లేదా? అని ప్రశ్నిస్తున్నాయి. ఎలాగైనా సీటు మాత్రం దక్కించుకోవాలని చూస్తున్నాయి. చూడాలి మరి తిరుపతి సీటు ఎవరికి దక్కుతుందో.

Share post:

Latest