కన్నా బాటలో కీలక నేతలు..టీడీపీలోకి జంపింగ్?

అసలు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పి బి‌జే‌పి నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితులోనూ టి‌డి‌పితో కలవమని అంటున్నారు. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు వద్దు అంటే వద్దు అంటున్నారు. కాకపోతే మధ్యలో జనసేన ఉంది. ప్రస్తుతం బి‌జే‌పితో జనసేన పొత్తులో ఉంది. టి‌డి‌పితో కలవాలని జనసేన చూస్తుంది. అలాంటప్పుడు బి‌జే‌పిని వదిలేసి టి‌డి‌పితో కలిసి రావడమే.

అయితే ఖచ్చితంగా టి‌డి‌పితో బి‌జే‌పి పొత్తు ఉండదని తేలడంతో…బి‌జే‌పిలో ఉంటే డిపాజిట్లు కూడా రావనే అంశం గ్రహించిన కమలం నేతలు..నిదానంగా బయటకొస్తున్నారు. పొత్తు ఉంటే కనీసం నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చు. ఇప్పుడు పొత్తు లేదని తేలడంతో ఇంకా బి‌జే‌పిలో ఉండటానికి కొందరు సిద్ధంగా లేరు. వరుసగా బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బి‌జే‌పిని వదిలి బయటకొచ్చేశారు. ఈయన టి‌డి‌పి లేదా జనసేనలో చేరతారని తెలుస్తోంది.

ఇలా కన్నా బయటకు రావడంతో బి‌జే‌పిలో అసంతృప్తిగా ఉన్న మరికొందరు నేతలు సైతం బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సైతం బి‌జే‌పిని వదిలి టి‌డి‌పిలోకి వస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఈయన టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయి బి‌జే‌పిలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ టి‌డి‌పిలోకి రావడానికి చూస్తున్నారు.

అటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం మళ్ళీ బి‌జే‌పి వైపుకు చూస్తున్నారని తెలిసింది. ఆయన కూడా గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఆ తర్వాత బి‌జే‌పిలోకి వెళ్లారు. ఇపుడు టి‌డి‌పితో పొత్తు లేదని తేలడంతో..బి‌జే‌పిని వీడటానికి సిద్ధమయ్యారని ప్రచారం వస్తుంది. చూడాలి ఇంకా ఎంతమంది బి‌జే‌పి నేతలు బయటకొస్తారో.

Share post:

Latest