కె.విశ్వనాథ్ సినిమాతోనే వెండితెరకు పవన్ పరిచయం.. ఆ సినిమా ఏంటంటే..??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజం ఏంటంటే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కె.విశ్వనాథ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ విషయాన్ని పవన్ ‘సైరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శుభలేఖ’ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడట. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి హైదరాబాద్‌కి రాకముందు మద్రాస్ టీ నగర్ లోని పోరూరు సోమసుందరం స్ట్రీట్ లో ఉండేవారు. ఆయన ఇంటి ఎదురుగానే విజయ నిర్మల ఇల్లు కూడా ఉండేది. అప్పుడు వారికి డబ్బింగ్ థియేటర్ కూడా ఉండేది. ఆ డబ్బింగ్ థియేటర్‌లోనే కె.విశ్వనాథ్, చిరంజీవి మొదటి కాంబో మూవీ ‘శుభలేఖ’కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

అదే సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ టీ తీసుకొని చిరంజీవికి ఇవ్వడానికి డబ్బింగ్ థియేటర్ లోకి వెళ్లారట. అప్పుడు పవన్ వయసు 16 ఏళ్ళు. చిరంజీవి శుభలేఖ సినిమాలో సర్వర్ గా పని చేసారు. అయితే చిరంజీవి పని చేసే హోటల్ లో ఒక సీన్ లో చిన్న చిన్న పాత్రలు మాట్లాడుతూ ఉంటాయి. ఇక డబ్బింగ్ థియేటర్ లోకి పవన్ కళ్యాణ్ ని విశ్వనాథ్ గారు పిలిచి నేను ఒక డైలాగ్ చెప్తాను నవ్వు అది చెప్పు అని అన్నారట. ‘మంచినీళ్లు ఎక్కడ సార్’ అనే చిన్న డైలాగ్‌ను విశ్వనాథ్ చెప్పగానే పవన్ కళ్యాణ్ కూడా ఆ డైలాగ్ ని చెప్పారట. పవన్ చెప్పిన ఆ డైలాగ్‌ని శుభలేఖ సినిమాలోని ఒక సీన్ లో వినబడుతుంది.

ఈ రకంగా చూసుకుంటే పవన్ మొదటి సినిమా శుభలేక, మొదటి డైరెక్టర్ విశ్వనాథ్ అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక కళాతపస్వి విశ్వనాథ్ నిన్న రాత్రి 11 గంటలకు మరణించారు. ఆయన మరణ వార్తలు వినగానే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన ఇంటికి సంతాపం తెలియజేసారు.