న‌న్ను తొక్కేస్తున్నారు.. నెపోటిజంపై కిర‌ణ్ అబ్బ‌వ‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో కిరణ్ అబ్బ‌వ‌రం ఒకడు. ఈ యంగ్ అండ్‌ మోస్ట్ టాలెంటెడ్ హీరో రీసెంట్ గా `వినరో భాగ్యము విష్ణుకథ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. మురళీ కిషోర్‌ అబ్బురూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు.

కాశ్మీరా పరదేశి ఇందులో హీరోయిన్ గా న‌టించింది. శివ‌రాత్రి పండుగ కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో.. విడుద‌లైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట ప‌ట్టింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ స‌క్సెస్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ లో కిర‌ణ్ న‌న్ను తొక్కేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

సోషల్ మీడియాలో కొంత మంది బ్యాచ్ తయారై తన మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ తొక్కే ప్రయత్నం చేస్తున్నార‌ని, కానీ ఎంత‌ ట్రోల్ చేసినా భ‌య‌ప‌డేది లేదు అంటూ కిర‌ణ్ చెప్పుకొచ్చాడు. మీరు నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని ఎంత ప్రయత్నం చేసినా నేను మాత్రం వెళ్ళను అని కిర‌ణ్ పేర్కొన్నాడు. ఇక నెపోటిజం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో అస్సలు లేద‌ని, ఉందని చాలా మంది భ్రమలో ఉన్నార‌ని, త‌న‌ను ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తున్నవారంతా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆయా కుటుంబాలకి చెందినవారే అని కిర‌ణ్ తెలిపాడు.