విశాఖ క్యాపిటల్..డైవర్షన్ పాలిటిక్స్..క్లియర్ స్కెచ్!

ఉత్తరాంధ్ర మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి అదిగో త్వరలోనే రాజధాని విశాఖకు మారుతుందని, విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెబుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు సైతం అదే తరహాలో విశాఖకు రాజధాని వస్తుందని ప్రకటనలు చేస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు.

పైగా మొదట మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఏపీకి రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ప్రస్తుతం రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉంది. ఇదిలా ఉండగానే వైసీపీ మాత్రం విశాఖకు రాజధాని షిఫ్ట్ అవుతుందని ప్రకటిస్తున్నారు. తాజాగా జగన్ సైతం అదే విధంగా..త్వరలో తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని, విశాఖ రాజధానిగా మారుతుందని ప్రకటన చేశారు. అసలు కోర్టు పరిధిలో ఉండగా ఇలా రాజధాని అంశంపై మాట్లాడటం సరికాదని న్యాయ నిపుణులు అంటున్నారు. అదే సమయంలో పక్కాగా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేశారని అంటున్నారు.

ఎందుకంటే గత కొన్ని రోజులుగా వివేకా హత్య కేసుపై ఏ స్థాయిలో కథనాలు వస్తున్నాయో తెలిసిందే. అటు అవినాష్ రెడ్డిని సి‌బి‌ఐ విచారించింది కూడా..ఇదే సమయంలో సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పి టి‌డి‌పి అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు ఇస్తుంది. ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ విశాఖ రాజధాని అని ప్రకటించారని, పైగా అది కూడా మూడు రాజధానులు ఎత్తేసి..కేవలం విశాఖ రాజధాని అంటూ ప్రకటనపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది.

అయితే ఇలా విశాఖకు రాజధాని షిఫ్ట్ అవుతుందనే చెబుతూనే ఉన్నారు గాని..షిఫ్ట్ చేయట్లేదు..అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విశాఖకు రాజధాని తీసుకొచ్చిన వైసీపీకి అనుకూలంగా మారడం కష్టమని అంటున్నారు.