కన్నాతో టీడీపీకి ప్లస్సేనా..రాయపాటి సైడ్ అవుతారా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంతవరకు టి‌డి‌పిలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువనే చెప్పాలి..జిల్లాలో దాదాపు సగం పైనే సీట్లు కమ్మ నేతల చేతుల్లో ఉంటాయి. మిగిలిన సీట్లలో ఎస్సీ, ఇతర కులాల వారు ఉంటారు. అయితే అక్కడ టి‌డి‌పిలో కాపు నేతలు పెద్దగా లేరు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో కాపు వర్గంలో కూడా నాయకుడు వచ్చినట్లు అయింది.

గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన కన్నా..పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ని వదిలి..వైసీపీలోకి వెళ్లాలని చూశారు. మధ్యలో బి‌జే‌పి పెద్దలు స్కెచ్ తో ఆయన..బి‌జే‌పిలోకి వచ్చారు. అలాగే ఏపీ అధ్యక్షుడుగా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత కూడా కొన్ని రోజులు అధ్యక్షుడుగా పనిచేశారు. కానీ తర్వాత సీన్ మారింది..ఆయనని తప్పించి సోము వీర్రాజుని అధ్యక్షుడుగా పెట్టారు. ఇక సోము వచ్చాక సీన్ మారింది..కన్నాకు ప్రాధాన్యత తగ్గింది..కన్నా టీంని సోము సైడ్ చేశారు.

దీంతో నిదానంగా కన్నా..బి‌జే‌పికి దూరమవుతూ వచ్చారు. చివరికి సోము వైఖరి నచ్చక బి‌జే‌పి వదిలి..టి‌డి‌పిలోకి వచ్చారు. అయితే టి‌డి‌పిలో వచ్చిన కన్నాకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనేది చూడాలి. ఆయనకు ఏ సీటు ఇస్తారనేది క్లారిటీ లేదు. అటు కన్నా రావడంపై టి‌డి‌పి సీనియర్ రాయపాటి సాంబశివరావు అలకపాన్పు ఎక్కారు. కన్నాతో గతంలో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓడిస్తామని అంటున్నారు.

అలాగే చంద్రబాబుని ఇంకా కలవనని చెప్పుకొచ్చారు. అసలు కన్నా వల్ల పార్టీకి ఉపయోగం లేదని అంటున్నారు. అయితే కన్నాకు పెదకూరపాడు, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి సీట్లలో కాస్త ఫాలోయింగ్ ఉంది. అది టి‌డి‌పికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. మరి కన్నా ఎంట్రీ వల్ల రాయపాటి నిదానంగా టి‌డిపికి దూరమవుతారేమో చూడాలి.