మర్రికి ఎమ్మెల్సీ..ఆ మాట కూడా నిలబెట్టుకుంటారా?

మొత్తానికి మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఎప్పటినుంచో ఆయన పదవి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. గత ఎన్నికల్లోనే జగన్..మర్రికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన చిలకలూరిపేట సీటు త్యాగం చేశారు.

2004లో కాంగ్రెస్ సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 200 ఓట్ల తేడాతో గెలిచిన మర్రి..తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో పేట నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు రాలేదు. ఎన్నికల ముందే టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన విడదల రజినికి సీటు ఇచ్చారు. దీంతో మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ఇక ఎన్నికల్లో రజిని గెలిచారు..ఆమె మంత్రి అయ్యారు..అయితే రజిని ఏ మాత్రం మర్రి వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో మర్రి వర్గం గుర్రుగా ఉంది. ఇటు ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోలేదనే అసంతృప్తి ఉంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మర్రికి జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మాట నిలబెట్టుకున్నారు. కానీ అదే సమయంలో ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారా? అంటే చెప్పడం కష్టమే.

ఇప్పటికే మండలి రద్దు అని చెప్పి ఇద్దరినీ క్యాబినెట్ లో నుంచి తొలగించారు. అయినా సరే ఎమ్మెల్సీలని మాత్రం భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీలని సైతం మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆ పని జరిగే ఛాన్స్ లేదు. పైగా పేటలో రజిని మంత్రిగా ఉన్నారు..అలాంటప్పుడు మర్రికి మంత్రి పదవి ఇవ్వడం కష్టమే.