తాడికొండ సీటులో ట్విస్ట్..మళ్ళీ కొలికపూడి ఎంట్రీ?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డౌట్ లేకుండా గెలిచే సీట్లలో అమరావతి పరిధిలోని తాడికొండ సీటుని ఖచ్చితంగా కౌంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఈ సీటులో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఇక గెలిచిన తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత తెచ్చుకోవడంలో ఎమ్మెల్యే ముందున్నారు. పైగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తో అమరావతిని వైసీపీ దెబ్బకొట్టడంతో..తాడికొండలో రాజకీయం మారిపోయింది.

అక్కడ ప్రజలు వైసీపీకి యాంటీగా మారిపోయారు. అక్కడ వైసీపీ నుంచి ఈ సారి ఎవరు నిలబడిన గెలవడం కష్టమనే పరిస్తితి. ఇదే క్రమంలో ఈ సారి ఆ సీటులో టి‌డి‌పి నుంచి ఎవరు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇంచార్జ్ గా తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఇక సీటు తనదే అని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో తాజాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు..తాడికొండలో తోకల రాజవర్ధన్ రావు పోటీ చేసి గెలుస్తారని చెప్పుకొచ్చారు.

అంటే తాడికొండ సీటు ఆయనకు ఇవ్వాలని రాయపాటి చెబుతున్నారు. ఇదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి నేత, రాజకీయ వ్యూహకర్త కొలికపూడి శ్రీనివాసరావు…తాడికొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ సరైనోడు నిలబడితే టి‌డి‌పి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. ఎవరు నిలబడిన 5 వేల పైనే మెజారిటీతో గెలుస్తారని, కానీ కరెక్ట్ నాయకుడు దిగితే 50 వేలు వస్తుందని అన్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో తాడికొండలో సరైన నాయకుడు కొలికపూడి అంటూ ప్రచారం మొదలైంది. ఇక దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ నెటిజన్లని కొలికపూడి ప్రశ్నించారు. అంతా కొలికపూడి సరైనోడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అంటే తాడికొండ సీటుని కొలికపూడి ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరి చంద్రబాబు తాడికొండ సీటు ఎవరికి ఫిక్స్ చేస్తారో చూడాలి.