లోకేష్ సీఎం..పవన్ డీల్..నాదెండ్ల కీ రోల్?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబుని పలు ఆంక్షలతో ప్రజల్లో తిరగనివ్వలేదు. ఇక త్వరలో లోకేష్ పాదయాత్ర ఉంది..ఇటు పవన్ బస్సు యాత్ర ఉంది. ఈ క్రమంలో బాబు-పవన్ భేటీ అయ్యారు.

అయితే బాబు-పవన్ భేటీ కావడంపై అధికార వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ ఒక ప్యాకేజ్ స్టార్ అని,  బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ తన రేటు పెంచుకోవడం కోసమే చంద్రబాబును కలిశాడని, శ్రీకాకుళంలో జరిగే సభ స్క్రిప్ట్ కోసం చంద్రబాబును పవన్ కలిశారని, పవన్ డబ్బు కోసం దిగజారి పోయాడని విమర్శిస్తున్నారు. అలాగే బాబు –పవన్ కలిసిన జగన్‌ని ఏం చేయలేరని, జగన్‌కే కలిసొస్తుందని కామెంట్ చేస్తున్నారు.

ఇదే సమయంలో వారి కలయికపై కే‌ఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 1,500 కోట్ల రూపాయలకు కాంగ్రెస్‌కు అమ్మేశారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ 1,000 కోట్ల రూపాయలకు జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టాడని, నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి నాదెండ్ల మనోహర్.. చంద్రబాబుతో 1,000 కోట్ల రూపాయలతో డీల్‌ను పవన్ కల్యాణ్‌కు కుదిర్చారని విమర్శించారు.

ఇలా ఎవరికి వారు బాబు-పవన్ భేటీపై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలని ప్రజలు నమ్ముతారో లేదో..అసలు బాబు-పవన్ కలిస్తే వైసీపీ మంత్రులు ఆ రేంజ్ లో ఎందుకు ఫైర్ అవుతున్నారు. తమకు నష్టం లేదంటూనే..తీవ్ర స్థాయిలో ఎందుకు విరుచుకుపడుతున్నారో తెలియకుండా ఉంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పవన్-బాబు కలయిక సెన్సేషన్‌గా మారింది.