గంటాకు క్లారిటీ..గెలిచేది ఎవరో తేలిందా?

ఏపీ రాజకీయాల్లో అవసరానికి తగ్గట్టు..సమయానికి తగ్గట్టు…తన ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా రాజకీయాలు చేయడంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని చెప్పవచ్చు. ఎప్పుడు గీలుపు గుర్రం ఎక్కడానికి ఈయన పార్టీలు సైతం మారుస్తూ ఉంటారు. అలాగే నియోజకవర్గాలు మారుస్తారు. ఇప్పటివరకు అదే తరహాలో రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేగా గెలిచారు గాని..అధికారం టీడీపీకి రాకపోవడంతో నిరాశ చెందారు. అటు వైసీపీ అధికారంలోకి వచ్చింది..పైగా టీడీపీ నేతల టార్గెట్ గా ఏ విధంగా రాజకీయం చేస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే. దీంతో గంటా సైలెంట్ అయ్యారు..అసలు టీడీపీలోనే వర్క్ చేయలేదు. ఇదే సమయంలో పార్టీ మారడానికి చూశారని పలుమార్లు వార్తలు వచ్చాయి. వైసీపీలోకి వెళ్లిపోతున్నారని కథనాలు వచ్చాయి. అదిగో గంటా వైసీపీలోకి వెళ్ళడం ఖాయమని ప్రచారం వచ్చింది.  కానీ గంటా మాత్రం పార్టీ మారలేదు. అలా అని టీడీపీలో యాక్టివ్ గా లేరు. దీంతో గంటా రాజకీయం ఏంటి అనేది ఎవరికి అర్ధం కాలేదు.

ఇదే సమయంలో ఏపీలో కాపు నేతల మీటింగ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మీటింగ్‌లు ఎవరి కోసం ఏంటి అనేది క్లారిటీ రాలేదు. ఇక చంద్రబాబు-పవన్ భేటీ కావడం..వారు పొత్తు దిశగా ముందుకెళుతున్న నేపథ్యంలో గంటా తాజాగా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా నారా లోకేష్‌తో భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది… తదితర అంశాలను లోకేష్‌కు వివరించినట్లు సమాచారం. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో గంటా పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అంటే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే గెలుపు సాధ్యమని, అధికారంలోకి వస్తామని ధీమాతో గంటా మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారని విశ్లేషణలు వస్తున్నాయి.