టీడీపీలోకి డీఎల్-శివారెడ్డి..సీట్లు గ్యారెంటీ?

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి గట్టి షాకులు తగిలేలా ఉన్నాయి. జిల్లాలో కొందరు సీనియర్లు టీడీపీలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత వరెస్ట్ ప్రభుత్వాన్ని చూడలేదంటూ ఆయన విరుచుకుపడుతున్నారు. అయితే దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన..మైదుకూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..ఇక 2019 ఎన్నికల్లో టీడీపీలోకి రావాలని చూశారు గాని..కుదరక వైసీపీలో చేరి..ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు.

కానీ తర్వాత తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు వైసీపీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఈయన టీడీపీలోకి రావడానికి రెడీ అయ్యారు. అటు మరో నేత వీర శివారెడ్డి సైతం టీడీపీలోకి రావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. డీఎల్, తాను టీడీపీలోకి వెళుతున్నామని తాజాగా ప్రకటించారు. అలాగే వీరికి సీట్లపై హామీ వచ్చిందని అందుకే టీడీపీలోకి రావడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.

అయితే డీఎల్..మైదుకూరు సీటు అడుగుతున్నారు. కానీ అక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. దీంతో డీఎల్‌కు కడప ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం ఉంది. కానీ కడప ఎంపీ సీటుపై డీఎల్ ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అటు శివారెడ్డి ఏమో కమలాపురం సీటు అడుగుతున్నారు. అక్కడ టీడీపీలో పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. మరి ఇద్దరు నేతలకు సీట్లు దక్కుతాయా? లేదా? అనేది క్లారిటీ లేదు. కానీ ఇద్దరు నేతలు మాత్రం టీడీపీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది.

Share post:

Latest