ఉరవకొండలో పయ్యావులకు వైసీపీ బ్రదర్ సాయం..!

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారింది..నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది క్లారిటీ రావడం లేదు. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. వాస్తవానికి ఇక్కడ గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఎక్కువ ఉంది. 1999 ఎన్నికల నుంచి అదే జరుగుతుంది. 1999లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే…రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

2004, 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో వైసీపీ గెలవగా, రాష్ట్రంలో టీడీపీకి అధికారం. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలవగా, రాష్ట్రంలో వైసీపీకి అధికారం వచ్చింది. ఇక ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయాలని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపుకు సానుకూల పవనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉరవకొండలో సత్తా చాటాలని పయ్యావుల చూస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లోనే పయ్యావుల తక్కువ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం ఉరవకొండలో ఆయనకు అనుకూలమైన వాతావరణం పెద్దగా  లేదు.  అలా అని ఇక్కడ వైసీపీకి సైతం అనుకూల వాతావరణం కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనే ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. ఉరవకొండలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఆయన కుమారుడు సైతం పార్టీ కోసం పనిచేస్తున్నారు.

ఇక అంతా బాగానే ఉందనుకునే సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు  మధుసూదన్ రెడ్డి ఉరవకొండ వైసీపీలో చిచ్చు పెట్టారు. తన అన్నకు సీటు ఇస్తే వైసీపీ ఓడిపోవడం గ్యారెంటీ అని, తన అన్న ఉరవకొండలో పార్టీని నాశనం చేశారని, కార్యకర్తలని పట్టించుకోవడం లేదని, ఒంటెద్దు పోకడలతో వెళుతున్నారని తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే రచ్చ లేపారు. అటు విశ్వేశ్వర్ రెడ్డి సైతం..అదే తరహాలో తన సోదరుడుకు కౌంటర్ ఇచ్చారు. దీంతో పార్టీని నాశనం చేయవద్దని, అంతా కలిసి పనిచేయాలని పెద్దిరెడ్డి చెప్పి వెళ్లిపోయారు.

అయినా అక్కడ విభేదాలు నడుస్తున్నాయి. ఎలాగైనా సీటు దక్కించుకోవాలని మధు కూడా ట్రై చేస్తున్నారు. ఒకవేళ తన అన్నకు సీటు ఇస్తే..పరోక్షంగా ఓడించేందుకు కూడా పనిచేసేలా ఉన్నారు. ఇది ఆటోమేటిక్ గా పయ్యావులకు ప్లస్ అయ్యేలా ఉంది. మరి ఉరవకొండ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.