ఎమ్మెల్యేలపై సీక్రెట్ ఫోకస్..అదే డౌట్‌తో..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని కాబట్టి ప్రజలందరి మద్ధతు ఉంటుందని, కాబట్టి 175 సీట్లు ఎందుకు గెలవకూడదో అని చెప్పి తమ పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఎప్పుడు క్లాస్ పీకుతూనే ఉన్నారు. అయితే జగన్ చెప్పిన టార్గెట్ సాధ్యమయ్యేదేనా అంటే..ఈ మాత్రం సాధ్యం కాని టార్గెట్. కాకపోతే 175 టార్గెట్ పెట్టం కదా..కనీసం 100 సీట్లు అయిన గెలిచి అధికారంలోకి రాలేమా? అనే ధీమా జగన్‌కు ఉంది.

అయితే వైసీపీ గెలుపు కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో వైసీపీకి అంత అనుకూల వాతావరణం కనిపించడం లేదు. అదే సమయంలో టీడీపీ-జనసేన గాని కలిస్తే వైసీపీకి ఇంకా రిస్క్. ఆ విషయం అందరికీ తెలుసు. పైగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జగన్..ఎమ్మెల్యేలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు..వారు ప్రజల్లోనే ఉంటున్నారా? లేదా? తమ బలాన్ని పెంచుకుంటున్నారా? లేదా ప్రతిపక్ష టీడీపీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారా? లేదా అనే అంశాలని ఎక్కువ పట్టించుకుంటున్నారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యేలపై నిఘా కూడా పెట్టారని తెలిసింది.  ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవలే పరిశీలకులను నియమించారు. ఇక వీరిని ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయం చేస్తారు. ఈ పరిశీలకులు నియోజకవర్గాల్లో ఎన్నికల వరకు మకాం వేసి, వైసీపీ ఎమ్మెల్యేల తీరును నిశితంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎదురు దాడి చేయనున్నారు.

అంటే ఎమ్మెల్యేల పనితీరుని పరిశీలించడంతో పాటు..టీడీపీకి కౌంటర్ ఎటాక్ చేయడానికి పరిశీలకులు ఉన్నారు. ఇక వీరి ద్వారా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుని జగన్ తెలుసుకుంటారు. అంటే ప్రతి ఎమ్మెల్యే అలెర్ట్ గా ఉండాల్సిందే. లేకపోతే వారిని పక్కన పెట్టేయడం ఖాయం.