ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ అయ్యారు. ఇంచార్జ్ గా ఉన్న వేగేశన నరేంద్రవర్మకు సీటు ఫిక్స్ అయింది. తాజాగా చంద్రబాబు బాపట్ల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో అడుగడుగున బాబు పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక బాపట్లలోని అంబేడ్కర్ కూడలిలో జరిగిన భారీ రోడ్ షోలో నెక్స్ట్ ఎన్నికల్లో వర్మని భారీ మెజారిటీతో గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు.
మొదట వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడిన బాబు..తర్వాత బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఆయన అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఇసుకలో దోపిడి, భూ కబ్జాలు చేస్తున్నారని, ఆఖరికి తన పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ పోయించుకోవాలని చెప్పి ఆర్డర్లు వేస్తున్నారని కోనపై బాబు ఆరోపణలు గుప్పించారు.
ఈ సమయంలోనే 1999 ఎన్నికల తర్వాత బాపట్లలో టీడీపీ గెలవలేదని, వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిందని..ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాదని, ఖచ్చితంగా ఇక్కడ టీడీపీని గెలిపించాలని, అలాగే బలమైన నాయకుడు నరేంద్ర వర్మని పెట్టానని, తనని భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో బాపట్ల అసెంబ్లీలో వర్మ పోటీ చేయడం ఫిక్స్ అయింది. అయితే 1999 ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ టీడీపీ గెలవలేదు. పలుమార్లు అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం లేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది.
అయితే ఈ సారి వర్మ వచ్చిన దగ్గర నుంచి పార్టీకి కొత్త ఊపు వచ్చింది. నిత్యం ఆయన ప్రజల్లోనే ఉంటున్నారు…వైసీపీపై పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో వరుసగా రెండుసార్లు గెలిచిన కోన రఘుపతిపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుతం పరిస్తితులని చూస్తే బాపట్లలో టీడీపీ అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి.