గంటాతో వైసీపీలో ట్విస్ట్..రివర్స్ జంపింగ్?

దశాబ్దాల పాటు విశాఖ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ..అధికారం కోసం పార్టీలు, నియోజకవర్గాలు మార్చే గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ మారడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు ఆయన టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్..మళ్ళీ టీడీపీలోకి వచ్చి..2014లో భీమిలి నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో టీడీపీకి దూరం జరిగారు. వైసీపీలోకి వెళ్లడానికి చూశారు గాని..విశాఖలో కొందరు వైసీపీ నేతలు గంటా రాకకు బ్రేక్ వేశారు.

అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, వైసీపీ బలహీన పడుతున్న తరుణంలో గంటాని వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. డిసెంబర్ 1న గంటా వైసీపీలో చేరతారని ప్రచారం ఉంది. దాదాపు గంటా వైసీపీలో చేరడం ఫిక్స్ అని తెలుస్తోంది. ఇక గంటా టీడీపీని వదులుతున్న నేపథ్యంలో..ఆ పార్టీ శ్రేణులు లైట్ తీసుకున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా పార్టీ మారే గంటాని తెలుగు తమ్ముళ్ళు పట్టించుకోవడం లేదు.

అలా అని గంటా రాకని వైసీపీ శ్రేణులు స్వాగతిస్తున్నాయా? అంటే వారు కూడా గంటా రాకపై హ్యాపీగా లేదు. కేవలం అధికారం కోసం వచ్చే గంటా లాంటి వారి వల్ల వైసీపీకి ఉపయోగం లేదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ తర్వాత వైసీపీ అధికారం కోల్పోతే నిలకడగా వైసీపీలో ఉంటారనే గ్యారెంటీ లేదని అంటున్నారు.

పైగా గంటా రాకని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా రాలేదు. గంటా వైసీపీలోకి వస్తే అవంతి ప్రాతినిధ్యం వహించే భీమిలి సీటు ఇస్తారని టాక్. ఇక అవంతిని అనకాపల్లి ఎంపీగా పంపిస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు టీడీపీ అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామంటే వద్దని, వైసీపీలో చేరి భీమిలి సీటు తీసుకుని గెలిచారు. మరి గంటా వైసీపీలోకి వస్తే అవంతి తన దారి తాను చూసుకుంటారని తెలుస్తోంది.