బేసిగ్గా సెంటిమెంట్ అనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా చాలా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. హీరోలు, హీరోయిన్లే కాకుండా దర్శక నిర్మాతలు కూడా ఇలా రకరకాల సెంటిమెంట్లను తమ సినిమాల విషయంలో పాటిస్తూ ఉండటం మనం చూడవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో తమ సెంటిమెంటును ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది హీరోలు కొంతమంది దర్శకులను సెంటిమెంట్లుగా భావిస్తే.. మరి కొంతమంది హీరోయిన్లను సెంటిమెంట్లుగా భావిస్తారు. ఇంకొంతమంది వారు ధరించే దుస్తులను కూడా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు.
ఉదాహరణికి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే కనీసం ఒక్క పాటలో అయినా సరే ఆయన వైట్ ఫ్యాంట్ తో కనిపించాలని సెంటిమెంటు చిరంజీవికి ఉందని మీకు తెలుసా? అలాగే తాను నటించే సినిమాలలో కనీసం ఒక్క సీన్ అయినా విశాఖపట్నంలో తీస్తే గానీ తనకు సక్సెస్ రాదు అనే సెంటిమెంటును అల్లు అర్జున్ బలంగా నమ్ముతాదాని మీకు తెలుసా? ఇక తాను దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిననాటినుండి పూర్తయ్యే వరకు తన గడ్డంతో పాటు మీసాన్ని కూడా కనీసం ట్రిమ్ కూడా చేయడట రాజమౌళి.
ఇక తమిళ దర్శకుడు భారతీరాజా తన సినిమాలలో తీసుకునే హీరోయిన్ల పేర్లు ‘ర’ అనే మొదటి అక్షరంతో మొదలైతే సూపర్ హిట్ అవుతుందని నమ్ముతాడట. అందుకే ఆయన రాధ, రాధిక, రేవతి అనే హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు తీశాడు. తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ విషయానికొస్తే తన సినిమా ఆడియో కాపీని మొట్టమొదటిగా తాము ఇష్టపడే దేవాలయానికి వెళ్లి పూజలు చేయించిన తర్వాతే సినిమా పబ్లిసిటీ మొదలు పెడతారట. వీరితోపాటు దిల్ రాజు, రామానాయుడు లాంటి బడా నిర్మాతలు కూడా తమ సినిమా ఆడియో కాపీని మొదటగా తమ ఇష్ట దైవం ముందు పెడతారని మీకు తెలుసా?