కర్నూలు కోటలో హిట్..ఆ ముగ్గురికి సీట్లు ఫిక్స్!

దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. వైసీపీపై వ్యతిరేకత పెరగడం కావచ్చు..చంద్రబాబుపై సానుభూతి పెరగడం కావచ్చు. టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపడం కావచ్చు..ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనలకు భారీ స్పందన వస్తుంది. 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర సమయంలో సభలకు ఎలాంటి స్పందన వచ్చిందో..అదే తరహాలో జనంలోకి వెళుతున్న బాబుకు భారీ స్పందన కనిపిస్తోంది.

మహానాడు, మినీ మహానాడు, బాదుడేబాదుడే కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇటీవల గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో బాదుడేబాదుడు కార్యక్రమాల్లో భాగంగా బాబు రోడ్ షోలు నిర్వహించారు. గుంటూరులో చిలకలూరిపేట, నరసారావుపేట, గురజాల లాంటి నియోజకవర్గాల్లో భారీగా ప్రజా స్పందన వచ్చింది. ఇటు కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గాయపేట స్థానాల్లో మంచి స్పందన వచ్చింది.

అయితే తమకు అనుకూలమైన కృష్ణా,గుంటూరు జిల్లాల్లోనే ఆ స్థాయిలో స్పందన వస్తే వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో బాబు రోడ్ షోలకు ఊహించని రీతిలో ప్రజలు వచ్చారు. పర్యటన ఆలస్యంగా నడిచిన సరే ప్రజలు గంటలుగంటలు వెయిట్ చేశారు. పెద్ద ఎత్తున తరలింపులు లేకపోయినా, జనం బాబు కోసం వెయిట్ చేశారు. పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిల్లో భారీ స్థాయిలో జనం వచ్చారు.

11 మండలాల్లో 32 గ్రామాలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ మున్సిపాలిటీల్లో చంద్రబాబు పర్యటన సాగింది. చంద్రబాబు రోడ్‌షో, బాదుడే బాదుడు సభకు 4 లక్షల నుంచి 4.5 లక్షలకు పైగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. టీడీపీ నేతలైతే 5-6 లక్షలు వరకు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండల్లో భారీ స్థాయిలో జనం వచ్చారు.  దీంతో ఆ మూడు స్థానాల ఇంచార్జ్‌లైన కె. మీనాక్షినాయుడు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబులని బాబు అభినందించారు. అలాగే వారి ముగ్గురికి సీట్లు కూడా దాదాపు కన్ఫామ్ చేసినట్లు తెలిసింది.

Share post:

Latest