గత కొన్ని రోజులుగా రాప్తాడు రాజకీయం బాగా హీటెక్కిన విషయం తెలిసిందే..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన జాకీ సంస్థ..వైసీపీ నేతల బెదిరింపులతో..ఇప్పుడు తెలంగాణకు తరలివెళ్లిపోయిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీని గురించి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసింది. అటు పత్రికల్లో కూడా వైసీపీ నేతల బెదిరింపుల వల్ల జాకీ సంస్థ తరలివెళ్లిపోయిందని కథనాలు వచ్చాయి.
ఇదే క్రమంలో ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి..చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని, తమ ప్రాంతంలో హత్యా రాజకీయాలు జరిగితే… మొదట చంద్రబాబు కొడుకు లోకేశ్‌నే టార్గెట్ చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాయి. అదే సమయంలో రాప్తాడు చెన్నేకొత్తపల్లికి చెందిన కొండేటి అప్పస్వామి అలియాస్ జగ్గు అనే టీడీపీ కార్యకర్త…ఎమ్మెల్యే తోపుదుర్తి, ఆయన సోదరుడు చంద్రశేఖ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని, లోకేష్‌ని చంపేస్తామనే వ్యాఖ్యలతోనే జగ్గు..ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యాడు.
దీంతో పోలీసులు జగ్గుని అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో జగ్గు కోసం స్టేషన్‌కు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు వచ్చారు. ఇక వారు వచ్చారనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మరో సోదరుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు..జగ్గు సోదరుడు సోమశేఖర్ నాయుడు, అనుచరులు సాంబశివుడు, పోతులయ్యపై దాడి చేశారు. ఇక అందులో ఒకరిని చంపడానికి ప్రయత్నించగా, వ్యక్తి మారిపోయాడని చెప్పి అతన్ని వదిలేశారు.
ఇక తమ కార్యకర్తలపై దాడి చేయడం, చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పరిటాల సునీతమ్మ, శ్రీరామ్, బీకే పార్థసారథి, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో సిఐ, ఎస్ఐలని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ధర్మవరం డీఎస్పీ వచ్చి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో..టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గాయి. ఇక ధర్నా చేయడంపై పరిటాల ఫ్యామిలీపై, కార్యకర్తలపై కేసులు పెట్టగా, అటు ఎమ్మెల్యే సోదరులు, పలువురు వైసీపీ నాయకులపై కూడా కేసులు నమోదు చేశారు. మొత్తానికి రాప్తాడులో పెద్ద వార్ నడిచిందనే చెప్పాలి. దీనిలో ఎమ్మెల్యే ఫ్యామిలీకి ధీటుగా పరిటాల ఫ్యామిలీ ఎక్కడా తగ్గలేదు.