చాలాకాలం తరువాత రజనీకాంత్ గెస్ట్ రోల్ లో చేస్తున్న సినిమా ఇదే!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ ఇండియా సినిమా పరిశ్రమలోనే పాన్ ఇండియా స్థాయిలో పేరు గాంచిన మొట్టమొదటి నటుడు అని చెప్పుకోవాలి. పాన్ ఇండియా ఈమధ్యన కాదు, ఓ పదేళ్ల క్రితమే రజనీ ‘రోబో’ సినిమా రూపంలో దుమ్ముదులిపేసాడు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజనీకాంత్ గతంలో రోబో 2.0 చిత్రంలో నటించి ఇండియాని షేక్ చేసిన సంగతి విదితమే. ఇకపోతే రజనీ ప్రస్తుతం 2 కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు.

ఇప్పుడదే బ్యానర్లో రజనీ మరోసారి ఇరగదీయనున్నారు. అవును, తాజాగా లైకా సంస్థ మరో సినిమాను మన సూపర్ స్టార్ తో స్టార్ట్ చేయనుంది. సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్యతో లాల్ సలామ్‌ అనే సినిమా చేస్తున్నట్లు తాజాగా వీరు ప్రకటించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా రజనీ ఓ అతిధి పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా చిత్ర టీమ్ ఓ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో మంటల్లో కాలిపోతున్న క్రికెట్‌ హెల్మెట్‌ని మనం చూడవచ్చును.

అంతేకాకుండా హెల్మెట్‌ పక్కన బాల్‌, వికేట్‌ బెల్స్ పడి ఉండటం గమనించవచ్చు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గెస్ట్‌ రోల్‌ పోషించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏ.ఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే రజనీ గారాలపట్టి ఐశ్వర్య ‘3’ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ తర్వాత ‘వాయ్‌ రాజా వాయ్‌’, ‘సినిమా వీరన్‌’ వంటి సినిమాలను తెరకెక్కించింది.

Share post:

Latest