నెల్లూరు టీడీపీలో భారీ మార్పులు..కొత్తవారికి సీట్లు.!

వైసీపీ కంచుకోట జిల్లాలో ఒకటిగా ఉన్న నెల్లూరులో టీడీపీ బలం చాలా తక్కువ. ఈ జిల్లాలో టీడీపీ మొదట నుంచి సత్తా చాటలేకపోతుంది. జిల్లాలో పది సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో 3, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..ఆ వ్యతిరేకతని మిగిలిన జిల్లాల్లోని టీడీపీ నేతలు యూజ్ చేసుకుని బలపడుతున్నారు గాని.. నెల్లూరు జిల్లా తమ్ముళ్ళు మాత్రం యూజ్ చేసుకోవడం లేదు.

దీంతో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వ్యూహకర్త రాబిన్ శర్మ..జిల్లాలో ఆయా స్థానాలపై సర్వేలు కూడా చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం గత ఎన్నికల్లో నిలబడిన వారికి కాకుండా ఈ సారి కొత్తవారికి సీటు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆత్మకూరు సీటులో గత ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన యాక్టివ్ గా లేరు.

దీంతో ఈ సీటుని టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డికి ఇస్తారని తెలుస్తోంది. కావలిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు..ఆ తర్వాత ఆయన యాక్టివ్ గా లేరు. దీంతో సుబ్బానాయుడుని ఇంచార్జ్ గా పెట్టారు. అటు ఉదయగిరిలో బొల్లినేని రామారావుని పక్కన పెట్టి..ఓ యువ నేతకు సీటు ఇస్తారని సమాచారం. ఇటు కోవూరులో పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడు దినేష్ రెడ్డిని పెట్టారు.

ఇక నెల్లూరు సిటీ, రూరల్ స్థానాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అబ్దుల్ అజీజ్‌లని సైతం మార్చేయడం ఖాయమని తెలుస్తోంది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలేదు. అసలు పూర్తిస్థాయిలో పోటీకి పెట్టలేదు. సిటీలో మాజీ మంత్రి నారాయణ గాని, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేసే ఛాన్స్ ఉంది. అటు రూరల్‌లో కూడా బలమైన నాయకుడుని పెట్టనున్నారు. సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పెడతారా? లేక ఆయన వారసుడుని నిలబెడతారో క్లారిటీ లేదు.