మంగళగిరిపై లోకేష్ పట్టు..తిప్పేస్తున్నాడుగా!

ఓడిన చోటే గెలవాలని పట్టుదలతో ఉన్న నారా లోకేష్..మంగళగిరి నియోజకవర్గంలో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన లోకేష్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వస్తున్నారో తెలిసిందే. ఇంకా లోకేష్ గెలవలేడని చెప్పి కామెంట్లు చేస్తున్నారు.

ఎవరు ఎంత ఎగతాళి చేసినా సరే లోకేష్ వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు మంగళగిరిలో పర్యటిస్తూ..అక్కడ తన బలాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. పైగా అమరావతి ఇష్యూ, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై ప్రజా వ్యతిరేకత లాంటి అంశాలు లోకేష్‌కు కలిసొస్తున్నాయి. అయినా సరే లోకేష్‌ని దెబ్బతీయాలని చెప్పి వైసీపీ ఎప్పటికప్పుడు కొత్త స్కెచ్‌లతో వస్తుంది. ఇదే క్రమంలో మంగళగిరిలో బలంగా ఉన్న బీసీ నాయకుడు గంజి చిరంజీవులుని వైసీపీలోకి తీసుకున్నారు.

ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ ఉండటంతో..నెక్స్ట్ ఆర్కేని వేరే చోటకు పంపించి, గంజిని లోకేష్‌పై పోటీకి దించి చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. కానీ ఈ సారి ఎన్ని ప్లాన్స్ వేసిన, ఎంత నెగిటివ్ ప్రచారం చేసిన తనకు చెక్ పెట్టడం సాధ్యం కాదనే విధంగా లోకేష్ కాన్ఫిడెంట్‌గా దూసుకెళుతున్నారు. ఓడిపోయిన సరే మంగళగిరి ప్రజలకు అండగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే పనులు చేస్తున్నారు.

సొంత డబ్బులు ఖర్చు పెడుతూ..పేద ప్రజలని ఆదుకుంటున్నారు. తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించిన లోకేష్..దాదాపు 12 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని చెప్పారు. ఇక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో లోకేష్ ముందు ఉంటున్నారు. రోడ్లు పాడైతే బాగు చేయిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యే కంటే ఎక్కువే చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తానని చెబుతున్నారు. ఇలా ఓడిపోయి కూడా లోకేష్ ప్రజలతో ఉంటూ, ప్రజల మద్ధతు పెంచుకుంటున్నారు. ప్రజలని తనవైపుకు తిప్పుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే గెలుపు దగ్గరకు లోకేష్ వెళుతున్నారని చెప్పొచ్చు.