కొడాలి-అనిల్‌ బ్యాడ్ టైమ్..లైట్ తీసుకున్నారా.!

కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌.. ఈ ఇద్దరి పేర్లు చెబితే చాలు..వీళ్ళు ఫైర్ బ్రాండ్ నాయకులు అని, జగన్‌కు వీర విధేయులు అని, అసలు జగన్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటారని, అవసరమైతే జగన్ కోసం ఎలాంటి త్యాగాలుకైనా సిద్ధంగా ఉండే నాయకులు అని చెప్పొచ్చు. ఇక జగన్‌ని ఎవరైనా ఏమైనా విమర్శ చేస్తే చాలు..వెంటనే వారిని పచ్చి బూతులు తిడతారు.

అయితే ఇలా వీర విధేయులుగా ఉన్న ఈ ఇద్దరికి జగన్ షాకులు మీద షాకులు ఇస్తున్నారు. మొదట మంత్రి పదవుల నుంచి తొలగించారు..తర్వాత ప్రాంతీయ సమన్వయకర్తల పదవి నుంచి తొలగించారు. కానీ మొదట్లో వీరిని జగన్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అలాగే కీలకమైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలు ఇచ్చారు. అనిల్‌కు భారీ నీటిపారుదల, కొడాలికి పౌర సరఫరాల శాఖలు ఇచ్చారు. కాకపోతే వీరు మంత్రులుగా తమ శాఖలకు సంబంధించి ఎలాంటి పనులు చేశారో ప్రజలకు పెద్దగా తెలియదు గాని..వీరు మంత్రులుగా చంద్రబాబు, పవన్, లోకేష్‌లని మాత్రం బూతులు తిట్టడంలో పోటీపడ్డారు.

కానీ తర్వాత మంత్రివర్గంలో మార్పులు సందర్భంలో ఇద్దరిని పదవుల నుంచి తొలగించారు. తర్వాత సమన్వయకర్తలుగా నియమించారు. అనిల్ కుమార్ యాదవ్‌ని వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు, కొడాలిని పల్నాడు జిల్లాకు సమన్వయకర్తలు పెట్టారు. కానీ వీరు ఈ పదవులకు కూడా న్యాయం చేయలేదని, ఆయా జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం గాని, ఆ ప్రాంతాల్లో ఎక్కువసార్లు పర్యటించడంలో విఫలమయ్యారు.

దీంతో వీరిని ఆ పదవుల నుంచి కూడా తొలగించారు. కొడాలి నాని ప్లేస్‌లో భూమన కరుణాకర్ రెడ్డికి పల్నాడు బాధ్యతలు ఇచ్చారు. అటు నెల్లూరుతో పాటు వైఎస్సార్, తిరుపతి బాధ్యతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఇంకా కొందరి పదవులని మార్చారు..అటు జిల్లా అధ్యక్షులని కూడా మార్చేశారు. కానీ వీర విధేయులుగా ఉండే కొడాలి, అనిల్ పదవుల నుంచి తొలగించడమే సంచలనంగా మారింది.