ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే..ఇవే తనకు చివరి ఎన్నికలు అని కర్నూలులో చెప్పి వచ్చిన చంద్రబాబు..తాజాగా మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై 13 జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేశారు..ఎన్నికల్లో గెలుపు దిశగా ఎలా వెళ్ళాలి..ఇప్పటినుంచి నాయకులు ఏ విధంగా పనిచేయాలి. బూత్ లెవెల్లో పార్టీని ఎలా బలోపేతం చేసుకురావాలి..పార్టీలో ఎలాంటి లోపాలు ఉన్నాయనే అంశాలపై చర్చించారు.
అయితే గత మూడున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తూనే ఉంది..కాకపోతే జగన్ సర్కార్..ప్రశ్నించే టీడీపీ నేతలపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం లాంటివి చేసిందని, పోరాటాన్ని ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా చేసిందనే ఉద్దేశం టీడీపీ నేతల్లో ఉంది. అనుకున్న స్థాయిలో తమ పోరాటాలు ప్రజల్లోకి వెళ్లలేదని భావిస్తున్నారు. కానీ ఈ సారి అలా కాకుండా..తమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి..జగన్ ప్రభుత్వం చేసే అస్తవ్యస్త, అరాచక విధానాలు జనంలోకి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. డిసెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయాలని..నియోజకవర్గ ఇంచార్జ్లకు సూచించారు. నిరుద్యోగం, పెరిగిన ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంట్ బిల్లులు, ఇసుక, మహిళా సమస్యలు, రైతుల సమస్యలు..ఇలా జగన్ అధికారంలోకి వచ్చాక పలు రకాల సమస్యలు వచ్చాయని, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అంటూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
అయితే ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు చేయడం, నాలుగు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి మమ అనిపిస్తున్న నేతలపై బాబు ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే ఓ టెక్నికల్ టీం క్షేత్ర స్థాయిలో నేతల పనితీరుని గమనిస్తున్నట్లు..తాజా సమావేశంలో వెల్లడించారు. కాబట్టి పక్కా వ్యూహంతో బాబు ముందుకెళ్లనున్నారు. ఇంకా టీడీపీ బలం పెంచేలా పనిచేయనున్నారు. ఇక జనవరిలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా పార్టీకి మరింత ఊపు వచ్చేలా ప్లాన్ చేయనున్నారు.