నూజివీడులో టీడీపీ జెండా..బాబు కాన్ఫిడెన్స్!

గత రెండు ఎన్నికల నుంచి నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం లేదు…2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైంది. 2014లో టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది..అయినా సరే టీడీపీలో ఉండే వర్గ పోరు వల్ల పార్టీకి నష్టం జరిగింది. 2019లో కూడా అదే పరిస్తితి ఉంది..కానీ అప్పుడు వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది. దీంతో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది.

మరి ఈ సారి నూజివీడులో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయంటే..అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మేకా ప్రతాప్‌కు పూర్తి అనుకూల వాతావరణం లేదు..ప్రభుత్వ పరమైన వ్యతిరేకత ఉంది..అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ. ఇటు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బాగానే కష్టపడుతున్నారు..పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే కొన్ని వర్గాల నేతల నుంచి ముద్దరబోయినకు సహకారం అందడం లేదు. దీని వల్ల నూజివీడులో టి‌డి‌పి ఇంకా వెనుకబడే ఉంది.

టీడీపీ జెండా ఎగరాలి

ఈ పరిణామాల క్రమంలో తాజాగా చంద్రబాబుతో, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. నూజివీడులో ఉండే పార్టీ పరిస్తితులని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతున్న ముద్రగడని అభినందిస్తూనే..నియోజకవర్గంలో సభ్యత్వాల చేర్పింపులో వెనుకబడిందని, దీనిపై దృష్టి సారించాలని చంద్రబాబు స్పష్టం  చేశారు.

అటు పార్టీ కమిటీలలో కొన్ని పోస్టులు భర్తీ కాలేదు. ఈసారి కచ్చితంగా నూజివీడులో టీడీపీ జెండా ఎగరాలని స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముద్దరబోయినకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారు..పార్టీ కమిటీ పోస్టులు భర్తీ చేసే అంశంలో విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది. ముద్దరబోయిన బి‌సి నేత కావడం, మళ్ళీ ఆయన గెలిస్తే తమ పెత్తనం పోతుందని కమ్మ వర్గం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ముద్దరబోయినకు పెద్దగా సపోర్ట్ చేయట్లేదు. ఈ అంశం వైసీపీ ఎమ్మెల్యేకు కలిసొస్తుంది. మరి ఈ సారి నూజివీడులో పోరు ఎలా ఉంటుందో చూడాలి.