వెస్ట్‌లో టీడీపీ జెండా..బుద్దా వర్గం దూకుడు?

విజయవాడ టీడీపీలో వర్గ పోరు ఇంకా నడుస్తూనే ఉంది..ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేయడం ఆపలేదు. ఇక్కడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాలకు ఏ మాత్రం పడటం లేదనే సంగతి తెలిసిందే. అనేక సార్లు వీరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. కార్పొరేషన్ ఎన్నిక సమయంలో ఎంత రచ్చ జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ రచ్చకు చెక్ పెట్టడానికి చంద్రబాబు ట్రై చేశారు గాని పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు.

పైగా ఈ పోరులోకి కేశినేని తమ్ముడు..కేశినేని శివనాథ్(చిన్ని) వచ్చారు. ఇక ఈయనకు కేశినేని వ్యతిరేక వర్గంగా ఉన్న బుద్దా వర్గం సపోర్ట్‌గా ఉంది. చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా తిరుగుతూ, పార్టీ కార్యక్రమాలని చురుగ్గా చేస్తున్నారు. ఈయనకు మద్ధతుగా దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బోండా ఉమాలు ఉన్నారు. ఇలా విజయవాడ టీడీపీలో రచ్చ నడుస్తోంది.

అయితే ఇలాంటి రచ్చ ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు..బుద్దాని ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా పెట్టారు. ఇటు కేశినేని నానికి విజయవాడ వెస్ట్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఈ సీటు విషయంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్ ఈ సీటు దక్కించుకోవడానికి అటు కేశినేని, ఇటు బుద్దా వర్గం ట్రై చేస్తూనే ఉంది. వెస్ట్‌లో టీడీపీని బలోపేతం చేసేందుకు కేశినేని వర్గం కృషి చేస్తుంది. ఇదే సమయంలో వెస్ట్‌లో బుద్దా వర్గం కూడా కార్యక్రమాలు చేస్తుంది. తాజాగా వెస్ట్ టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బుద్దా, బోండా, కేశినేని చిన్ని, నాగుల్ మీరా, పట్టాభి లాంటి నేతలు పాల్గొన్నారు.

విజయవాడ వెస్ట్‌లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేయాలని బుద్దా పిలుపునిచ్చారు. అసలు వెస్ట్ ఇంచార్జ్‌గా ఉన్న కేశినేని నాని లేకుండా ఈ సమావేశం జరిగింది. అంటే బుద్దా వర్గం వెస్ట్‌పై పట్టు కోసం చూస్తుందని అర్ధం చేసుకోవచ్చు. అయితే జనసేనతో పొత్తు ఉంటే ఈ సీటుని ఆ పార్టీకి ఇచ్చేస్తే ఏ గోల ఉండదు.