కలహాలతో కంచుకోటని మళ్ళీ కూల్చేస్తారా?

అందివచ్చిన అవకాశాలని తెలుగుదేశం నాయకులు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు వైసీపీ దెబ్బకు టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలకు, కార్యకర్తలని వైసీపీ ఏవిధంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. అటు చంద్రబాబుకు అడుగడుగున అవమానాలే ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్తితి మళ్ళీ రాకూడదని అటు అధినేత, ఇటు కార్యకర్తలు కష్టపడుతున్నారు. మరొకసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

కానీ టీడీపీలో ఉన్న కొందరు నేతలు ఆధిపత్యం కోసం పార్టీనే నాశనం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనబడుతోంది. ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడేది లేకుండా..పార్టీలో అంతర్గత కలహాలు పెంచి..పార్టీని ఇంకా నాశనం చేస్తున్నారు కొందరు తెలుగు తమ్ముళ్ళు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా భావించే అనంతపురం జిల్లాలో తమ్ముళ్ళ రచ్చ ఎక్కువ ఉంది. అందులోనూ కంచుకోట లాంటి కళ్యాణదుర్గంలో నేతల మధ్య రచ్చ ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో సీనియర్ నేత వున్నాం హనుమంతరాయచౌదరీని కాదని, ఉమామహేశ్వరనాయుడుకు చంద్రబాబు సీటు ఇచ్చారు.

జగన్ గాలిలో ఉమామహేశ్వరనాయుడు ఓటమి పాలయ్యారు. కళ్యాణదుర్గం నుంచి వైసీపీ తరుపున ఉషశ్రీ చరణ్ గెలిచి..ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఆమెకు పెద్ద పాజిటివ్ లేదు. ఈ క్రమంలో వైసీపీపై ఉన్న నెగిటివ్‌ని తనకు పాజిటివ్‌గా మార్చుకునే విధంగా ఉమామహేశ్వరనాయుడు పనిచేస్తున్నారు…నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు..వైసీపీ అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. అలా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

కానీ ఉమామహేశ్వరనాయుడుకు వ్యతిరేకంగా సీనియర్ నేత హనుమంతరాయచౌదరీ సెపరేట్ వర్గం పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఈయనకు రామ్మోహన్ చౌదరీ, మల్లిఖార్జున్ చౌదరీ మద్ధతుగా ఉన్నారు. ఉమామహేశ్వరనాయుడుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో వీరికి బాబు క్లాస్ కూడా ఇచ్చారు. ఇంచార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలోనే పనిచేయాలని చెప్పారు. అయితే బాబు దగ్గర ఓకే అని చెప్పి..కళ్యాణదుర్గం వచ్చాక వీరు మళ్ళీ గ్రూపు రాజకీయం చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎటువైపు ఉండాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రూపు రాజకీయం ఇలాగే కొనసాగితే మళ్ళీ కళ్యాణదుర్గంలో టీడీపీ ఓడిపోవడం గ్యారెంటీ అని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు.