కేశినేని వర్సెస్ కోవర్టులు..కృష్ణా టీడీపీకి డ్యామేజ్.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ బలం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కృష్ణా అంటే టీడీపీ కంచుకోట అనే విధంగా ఉండేది. అయితే ఇదంతా 2019 ఎన్నికల ముందు..ఆ తర్వాత నుంచి టీడీపీకి భారీ డ్యామేజ్ జరుగుతూ వచ్చింది. ఎన్నికల్లో ఎలాగో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కూడా జిల్లాలో పార్టీ పుంజుకోలేని పరిస్తితి. నిజానికి కృష్ణాలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు.

పైగా ఎవరికి వారు మీడియాకు కనబడేలా హడావిడి చేయడం తప్ప..గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయట్లేదు. అలాగే సొంత నేతలే పార్టీకి నష్టం చేకూర్చేలా ముందుకెళుతున్నారు. అయితే పార్టీలో వాస్తవ పరిస్తితులని ఉన్నది ఉన్నట్లుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎప్పటికప్పుడు బయటకు చెప్పేస్తున్నారు. గత ఎన్నికల దగ్గర నుంచి పార్టీలో ఉన్న సమస్యలపై నాని విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే నాని బహిరంగంగా పార్టీలోని సమస్యలని బయటపెడుతుంటే..ఆయనపై సొంత పార్టీ వాళ్లే తిరగబడే పరిస్తితి.

అదిగో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు..అలాగే ఆయన పార్టీ మారిపోతారని ప్రచారం చేస్తున్నారు..దీనిపై కూడా కేశినేని గట్టిగానే స్పందించారు..తాను పార్టీ మారిపోతానని చేసే ప్రచారంపై పెట్టే శ్రద్ధ..పార్టీలో ఉన్న తప్పులని సరిచేయడం పెట్టాలని సూచించారు. వాస్తవానికి కొందరు నాయకులు మాదిరిగా చంద్రబాబుకు భజన చేయకుండా కేశినేని..ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తున్నారు.

ఆయన మాటలు పట్టించుకుని పార్టీలోని సమస్యలని పరిష్కరించకుండా..చివరికి ఆయనపైనే రివర్స్ అవుతున్నారు. అయితే తాజాగా తిరువూరు టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలపై విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. దీనికి కౌంటరుగా …అది నిజమైతే తాను ఓ లిస్ట్ పంపుతానని ఆ కోవర్టులపై చర్యలు తీసుకోవాలని కేశినేని మాట్లాడారు. ఇక కేశినేని మాటలని కొందరు తమ్ముళ్ళు వ్యతిరేకిస్తుండగా, కొందరు సమర్ధిస్తున్నారు. ఏదేమైనా కేశినేని చెప్పినట్లు..పార్టీలో ఉన్న భజనపరులు, కోవర్టులని సైడ్ చేయకపోతే కృష్ణా జిల్లాలో టీడీపీకి డ్యామేజ్ పెరుగుతుందే తప్ప..తగ్గదు.