ఈనాడు తగ్గట్లేదుగా..నెక్స్ట్ ఎవరు?

అధికార వైసీపీ పదే పదే యెల్లో మీడియా..దుష్టచతుష్టయం అంటూ..చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము మంచి పనులు చేస్తుంటే దుష్టచతుష్టయం అడ్డుకుంటుందని జగన్ దగ్గర నుంచి ప్రతి వైసీపీ కార్యకర్త మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం చేసే మంచి పనులు ఏంటి అనేవి పక్కన పెడితే..జగన్‌కు భజన చేస్తూ..చంద్రబాబు టార్గెట్‌గా విరుచుకుపడే మీడియా సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. వాటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. కానీ జగన్..తమకు ఏ మీడియా సపోర్ట్ లేనట్లు మాట్లాడుతుంటారు.

ఈ మీడియా సపోర్ట్ పక్కన పెడితే..పదే పదే ఈనాడుతో సహ ఏబీఎన్, టీవీ5  టార్గెట్‌గా వైసీపీ విరుచుకుపడుతుంది. ఇందులో ఏబీఎన్, టీవీ5లు డైరక్ట్‌గా వైసీపీని టార్గెట్ చేస్తూ కథనాలు ఇచ్చేవి. కానీ ఈనాడు మీడియా గాని, పత్రిక గాని డైరక్ట్‌గా వైసీపీ విధానాలని తప్పుబడుతూ కథనాలు ఇవ్వలేదు. ఎప్పుడో ఏమన్నా ప్రజా సమస్యలపై వార్తలు ఇవ్వడం, లేదా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై చేసే ఆరోపణలని హైలైట్ చేయడం చేసేది. అలాగే జగన్, వైసీపీ నేతలు కౌంటర్లని మీడియాలో ఇచ్చేది.

కానీ ప్రత్యేకంగా వ్యక్తులని టార్గెట్ చేస్తూ కథనాలు ఇవ్వలేదు. అయితే ఈనాడుని టార్గెట్ చేయడం, రామోజీరావుపై వ్యక్తిగతంగా దూషణలకు దిగడంతో..ఈనాడు కూడా రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే వరుసపెట్టి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఇవి అంటూ కథనాలు ఇస్తుంది. మొదట అమరావతిపై జగన్ విషం చల్లుతున్నారని పెద్ద కథనమే ఇచ్చింది. తర్వాత పోలవరం విషయంలో వైసీపీ మిస్టేక్స్. ఇలా వరుసపెట్టి ఇస్తూ..ఇప్పుడు విశాఖ పరిపాలన రాజధాని అని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ మంత్రులు విమర్శిస్తున్నారు.

ఇలా ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటూ జపం చేస్తున్న వారి భూ అక్రమాలు అంటూ ఈనాడు కథనాలు ఇస్తుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి, ఎంపీ ఎం‌వి‌వి సత్యనారాయణ విశాఖలో భూ అక్రమాలు చేశారని కథనాలు ఇచ్చింది. అలాగే వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి శూన్యం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, ఉత్తరాంధ్రకు వైసీపీనే అన్యాయం చేస్తుందనే కోణంలో ఈనాడు విరుచుకుపడింది. ఇక ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం అంటూ చెబుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు భూ అక్రమాలు అంటూ పెద్ద ఎత్తున కథనాలు ఇస్తుంది. అయితే ఈనాడు ఇలా అనూహ్యంగా టార్గెట్ చేయడంతో..వైసీపీలో నెక్స్ట్ ఎవరి గురించి కథనం వస్తుందో అని, వైసీపీ నేతలే టెన్షన్ పడే పరిస్తితి.