ఆ ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలకే లక్.!

పైకి కుప్పంతో కలిపి 175కి 175 సీట్లు గెలిచేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నా..ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని ప్రశ్నించినా సరే. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్తితులు వేరు. ప్రస్తుతం పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా లేవు. వైసీపీకి 151 మంది ప్లస్ టీడీపీ-జనసేన నుంచి వచ్చిన 5 గురు ఎమ్మెల్యేలని కలుపుకుంటే 156 మంది ఎమ్మెల్యేల బలం ఉండొచ్చు. అంటే అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ హవా ఉండొచ్చు.

కానీ అది పైకి కనిపించే బలం మాత్రమే..వాస్తవ పరిస్తితులని చూస్తే…వైసీపీ బలం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. బలం తగ్గింది గాని అధికారంలోకి వచ్చేంత సంఖ్యా బలం మాత్రం తగ్గలేదు. గట్టిగా చూసుకుంటే 100 స్థానాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గానే ఉంది. అలా అని ఎన్నికల నాటికి ఈ బలం తగ్గొచ్చు..పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే బలం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. అలాగే టీడీపీ బలం పెరుగుతుంది. అటు జనసేన కూడా పుంజుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి పెద్ద రిస్క్.

ఆ విషయం పక్కన పెడితే…ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీలోని కమ్మ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సారి వైసీపీ నుంచి ఎక్కువ మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, దెందులూరులో అబ్బయ్య చౌదరీ, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు గెలిచారు.

ఇటు టీడీపీ నుంచి గెలిచిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వచ్చారు. మొత్తానికి 8 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మళ్ళీ కొడాలి నాని, వంశీలకే గెలుపు అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో తేలింది. అయితే చీరాల సీటు మళ్ళీ కరణంకు దక్కుతుందో లేదో క్లారిటీ లేదు. మొత్తానికి ఈ సారి వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలకు దెబ్బ పడేలా ఉంది.