నాలుగు సీట్లు..లక్ష మెజారిటీ..!

ఎన్నికలకు సమయం దగ్గర పడిపోతుంది..గట్టిగా తిప్పికొడితే ఇంకా ఏడాదిన్నర కూడా సమయం లేదు.ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఆరు నెలలు మాత్రమే. ఇక ఎన్నికలకు అటు వైసీపీ, ఇటు టీడీపీకి ఇప్పటినుంచే సన్నద్ధమైపోతున్నాయి. ఇప్పటినుంచే అభ్యర్ధుల విషయంలో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అలాగే నియోజకవర్గాల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇలా టీడీపీ-వైసీపీ దూకుడుగా ఉంటే..జనసేన మాత్రం ఎన్నికల విషయంలో దూకుడు కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు.

ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నాయకులు లేరు. పోనీ బలం ఉన్న స్థానాలపైన ఫోకస్ చేసి..అక్కడ బలమైన నాయకులని నిలబెట్టే విధంగా పవన్ కల్యాణ్ ముందుకెళుతున్నారా? అంటే అది కనిపించడం లేదు. అసలు పవన్ ఇంతవరకు ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ రావడం లేదు. గత ఎన్నికల్లో అంటే భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా ఆ సీట్లలో పోటీ చేస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి.

అలాగే పవన్ పోటీ చేసే సీట్లపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం సీటు ఫిక్స్ కాలేదు. ఆ మధ్య వెస్ట్ గోదావరి జనసేన జిల్లా అధ్యక్షుడు..పవన్ మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. కొందరేమో తిరుపతి అంటారు. కానీ అధికారికంగా ఏ సీటు ఫిక్స్ కాలేదు. ఇప్పుడు తాజాగా పవన్..నాలుగు సీట్లలో సర్వేలు చేయించుకుంటున్నారని..తిరుపతి, పిఠాపురం, కాకినాడ రూరల్, విశాఖ నార్త్ సీట్లలో ఏదొక చోట పోటీ చేయొచ్చని, ఈ నాలుగు చోట్ల జనసేన బలం ఉందని, ఎక్కడ పోటీ చేసిన పవన్ ఈజీగా గెలిచేస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే తిరుపతిపైనే పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టారని, అక్కడ గెలుపు మంచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ జనసేన నాయకులైతే..తిరుపతిలో పవన్ పోటీ చేస్తే లక్ష మెజారిటీతో గెలుస్తారని సవాల్ చేస్తున్నారు. మెజారిటీ గురించి పక్కన పెడితే…ముందు సీటు ఫిక్స్ చేసుకుని, గెలుపు కోసం పనిచేస్తే బెటర్ అని చెప్పొచ్చు.