హీరో అతి మంచితనాన్ని క్యాష్ చేసుకొని నిండా ముంచేసిన నిర్మాత!

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అతి మంచితనం అనేది పనికిరాదని చాలా మంది సినిమా పండితులు చెబుతూ వుంటారు. అయితే అది చాలా సందర్భాల్లో రుజువైంది. అయినా సరే కొంత మంది మన సినిమా అనుకుని సెంటిమెంట్ తో మునిగిపోతున్నారు. నిర్మాతల చేతుల్లో అడ్డంగా మోసపోతున్నారు. హీరో తమ సినిమా చేయడం లేదని ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడం లేదని నిర్మాతలు రోడ్డెక్కిన ఉదంతాలు చాలా చూశాం. కానీ మొట్టమొదటి సారి టాలీవుడ్ లో రీసెంట్ గా ఓ యంగ్ హీరోని ప్రొడ్యూసర్ మోసం చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.

కొత్త తరహా కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తూ హీరోగా తనదైన మార్కు సినిమాల్లో నటిస్తున్నాడు ఓ వర్ధమాన హీరో. ఆ మధ్య కిడ్నాప్ నేపథ్యంలో ఓ సినిమా చేసి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న సదరు హీరో రీసెంట్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న హీరోకు రిలీజ్ రోజే నిర్మాత పెద్ద షాకిచ్చాడు. ఫైనాన్స్ క్లియర్ చేయకపోవడంతో సదరు హీరో నటించిన సినిమా మార్నింగ్ షోస్ పడలేదు. దీంతో నిర్మాత క్లియర్ చేయాల్సిన ఫైనాన్స్ ని తానే నెత్తిన వేసుకుని క్లియర్ చేసి మొత్తానికి సినిమాని థియేటర్లలోకి మధ్యాహ్నం షో నుంచి తీసుకొచ్చాడు.

అయితే అంత రిస్క్ చేసినా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో డివైడ్ టాక్ తెచ్చుకొని సదరు హీరోకి షాకిచ్చింది. పాజిటివ్ టాక్ బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఫైనాన్స్ క్లియర్ చేయకపోగా సదరు నిర్మాత హీరో రెమ్యునరేషన్ ని కూడా ఇవ్వకపోవడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాలు పెట్టుకుని తొలి సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ట్రై చేస్తే సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోడంతో సదరు హీరో తీవ్ర మనస్థాపానికి గురయ్యారట. ఇంత చేసినా డబ్బులు పోగా.. రెమ్యునరేషన్ కూడా వదులుకోవాల్సి రావడంతో సదరు హీరో ఇకపై సినిమాల విషయంలో కఠినంగా వుండాలని నిర్ణయించుకున్నాడట.

Share post:

Latest