ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని మళ్ళీ ఆపలేరా?

జగన్ అధికారంలోకి వచ్చాక..అసలు టీడీపీని దెబ్బతీయడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలనే కాన్సెప్ట్‌తో జగన్ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు అయిన వచ్చాయి…కానీ ఈ సారి మాత్రం ఆ సీట్లు కూడా రాకుండా చేయాలనే విధంగా జగన్ రాజకీయం ఉంది. అందుకే టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఈ సారి గట్టిగా ఫోకస్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు కంచుకోట కుప్పంలో ఎలాంటి రాజకీయం నడిపిస్తున్నారో తెలిసిందే.

అలాగే మిగిలిన టీడీపీ సిట్టింగ్ సీట్లపై కూడా ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ సిటీపై కూడా గట్టిగా ఫోకస్ పెట్టారు. సిటీలో నాలుగు సీట్లు టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సిటీలో టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదిపింది. ఈ క్రమంలోనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి లాగారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు యాక్టివ్ గా లేరు. దీంతో ఈ రెండు స్థానాలపై వైసీపీ పట్టు సాధించింది.

అలాగే విశాఖ ఈస్ట్, వెస్ట్ సీట్లలో కూడా పట్టు సాధించాలని గట్టిగా ట్రై చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులకు చెక్ పెట్టేలా ముందుకెళ్లారు. అక్రమ కట్టడాలు కూల్చివేత అని భయపెట్టడానికి చూశారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో..రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కువ డివిజన్లు సాధించింది. ముఖ్యంగా ఈస్ట్‌లో వైసీపీ ఎక్కువ గెలిచింది.

దీంతో ఇంకా వెలగపూడికి వైసీపీకి చెక్ పెట్టినట్లే అని ప్రచారం జరిగింది. నెక్స్ట్ వెలగపూడిని ఓడిస్తామని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడికి మాత్రం ఈస్ట్‌లో బలం తగ్గలేదని తెలుస్తోంది. తాజా సర్వేలో మళ్ళీ ఈస్ట్‌లో టీడీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది. అంటే ఇక్కడ వైసీపీకి మళ్ళీ గెలిచే ఛాన్స్ కనబడటం లేదు. వెలగపూడికి నాల్గవ సారి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share post:

Latest