యాంటీ బీజేపీ: కేసీఆర్‌తో జగన్..?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి..కేంద్ర స్థాయిలోనే చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీపై కేసీఆర్ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం స్థాయిలో కూడా కేసీఆర్…మోదీ సర్కార్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఏమో…కేసీఆర్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అందుకే కేసీఆర్..కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోదీని గద్దె దింపాలని, బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం అందుకున్నారు.

ఇదే క్రమంలో దేశంలో బీజేపీయేతర పార్టీలని ఏకం చేసే పనిలో ఉన్నారు..ఇప్పటికే విపక్ష నేతలతో వరుసగా సమావేశమవుతూ వస్తున్నారు. అలాగే అతి త్వరలోనే జాతీయ పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారు. జాతీయ పార్టీ పెట్టి..తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు.

ఇప్పటికే స్టాలిన్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, నితిశ్ కుమార్, కుమారస్వామి, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ లతో కేసీఆర్ భేటీ అయ్యారు. అలాగే ఇంకా దేశంలో విపక్ష నేతలని కలిసి…బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే ఈ కూటమిలోకి కేసీఆర్ సన్నిహితుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా చేరుతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రస్తుతం బీజేపీకి పరోక్షంగా మద్ధతు తెలుపుతున్న జగన్…కేసీఆర్ వైపు ఇప్పుడే రావడం కష్టమని తెలుస్తోంది. ఒకవేళ నిదానంగా కేంద్రంలో బీజేపీ బలం తగ్గుతున్నట్లు కనిపించినా, నెక్స్ట్ అధికారంలోకి రావడం కష్టమని భావించినా సరే జగన్..కేసీఆర్‌కు మద్ధతు తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. మోదీ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, సీఎం కేసీఆర్ తో వైఎస్ జగన్ లాంటి నాయకులు కలిసివచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. మరి కేసీఆర్‌కు జగన్ మద్ధతు ఉంటుందో లేదో చూడాలి.