బాబు ‘బీసీ’ మంత్రం..కలిసొస్తుందా?

బీసీలు అంటే టీడీపీ…టీడీపీ అంటే బీసీలు.. అసలు టీడీపీని, బీసీలని వేరుగా చూడని పరిస్తితి. టీడీపీ ఆవిర్భావం నుంచి..ఆ పార్టీకి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు బీసీలకు పెద్ద పీఠ వేస్తూ వచ్చారు. పార్టీ పదవుల్లో గాని..ప్రభుత్వ పదవుల్లో గాని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే బీసీలు..టీడీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్నారు.

కానీ గత ఎన్నికల్లో బీసీలే రివర్స్ అయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడకక్కడ కమ్మ వర్గం ఆధిపత్యం పెరగడం, బీసీ నేతలకు పదవులు ఉన్నా సరే పెత్తనం కమ్మ నేతలది అన్నట్లుగా ఉండటం. కొందరు బీసీ నేతలని డమ్మీగా చేయడం…ఇంకా బీసీలకు అనుకున్న రీతిలో సంక్షేమం గాని, ఇతరత్రా కార్యక్రమాలు అమలు చేయడంలో చంద్రబాబు కాస్త వెనుకబడ్డారు. దీంతో బీసీలు కాస్త మార్పు కోరుకున్నారు. గత ఎన్నికల్లో ఎక్కువశాతం జగన్ పక్షాన నిలబడ్డారు. అందుకే జగన్ భారీగా స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు.

అయితే అలా వైసీపీ వైపుకు వెళ్ళిన బీసీ వర్గాలని తమవైపుకు తిప్పుకోవడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే బీసీల మద్ధతు తప్పనిసరి. అందుకే వారి మద్ధతు పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు బీసీ మంత్రం జపిస్తూనే ఉన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని, బీసీలని పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు.

వాస్తవానికి జగన్ ప్రభుత్వం బీసీలకు బాగానే పదవులు ఇచ్చింది..కానీ సేమ్ టీడీపీలో మాదిరిగా బీసీలకు పదవులు వచ్చినా సరే పెత్తనం రెడ్డి నేతలది అన్నట్లు ఉంది. అలాగే ప్రత్యేకంగా బీసీలకు ఒరిగింది అంటూ ఏమి లేదు. దీంతో బీసీలని ఎలాగైనా తమవైపుకు తిప్పుకోవాలని బాబు చుస్తున్నారు. అందుకే పార్టీలో బీసీలకు ప్రాధాన్యత పెంచుతున్నారు..బీసీ నేతలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి చుస్తున్నారు. అలాగే గతంలో టీడీపీ హయాంలో బీసీలకు ఏం చేశామనే అంశాలని పదే పదే వివరిస్తున్నారు.

ఇక తాజాగా బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశారు.  టీడీపీ బలోపేతంగా ఉండడానికి బీసీలే కారణమని, వారికి ఎన్టీఆర్‌ రాజకీయ ప్రాధాన్యమిచ్చారని.. ఎన్టీఆర్‌ 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. తాను 35 శాతం చేశానని.. ఇప్పుడు జగన్‌ 9 శాతం కోత వేసి 24 శాతానికి కుదించారని ఫైర్ అయ్యారు. మొత్తానికి మళ్ళీ బీసీలని దగ్గర చేసుకోవడానికి బాబు గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఈ సారి బీసీలు టీడీపీ వైపు చూస్తారో లేదో చూడాలి.

Share post:

Latest