అయ్యన్నని మళ్ళీ నిలువరించడం కష్టమే..!

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..అలాగే ఎల్లకాలం ఒకరికే అధికారం ఉండదు..ఇక గెలిచిన వాళ్లే మళ్ళీ గెలవరు…ఓడిన వారు జీవితాంతం ఓడిపోతూ ఉండరు. కాబట్టి రాజకీయం ఎప్పుడు ఎలాయిన మారిపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారుతున్నట్లే కనిపిస్తోంది..2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్నీ వైసీపీకి అనుకూలంగానే నడుస్తూ వచ్చాయి. గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంది.

ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే అనే పరిస్తితి..ఒకవేళ పరిస్తితులు అనుకూలంగా లేకపోయినా అధికార బలంతో అనుకూలంగా మారేలా చేసుకున్నారు. ఇది మొన్నటివరకు ఏపీలో ఉన్న పరిస్తితి..కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. వైసీపీకి పోటీగా టీడీపీ ఎదుగుతుంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు పికప్ అవుతున్నారు. అసలు గత ఎన్నికల్లో గెలుపు ఖాయమని అనుకున్న టీడీపీ నేతలు సైతం జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. అలాంటి నేతలు ఇప్పుడు ఊహించని విధంగా పుంజుకుంటున్నారు.

అలా పుంజుకుంటున్నవారిలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నం నుంచి తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంటూ..టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న అయ్యన్నకు 2019 ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదురైంది. ఉమా శంకర్ గణేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అలా అని ఓడిపోయాక అయ్యన్న సైలెంట్ గా ఉండిపోలేదు. వైసీపీకి భయపడి చాలామంది నేతలు బయటకు రాకపోయినా సరే అయ్యన్న మాత్రం బయటకొచ్చి పార్టీ కోసం నిలబడ్డారు. మళ్ళీ తన నియోజకవర్గంలో నిలదొక్కుకున్నారు.

ఇక మూడు రాజధానులు అని చెప్పి విశాఖలో టీడీపీని దెబ్బతీయాలని జగన్ చూసినా సరే అయ్యన్న..అమరావతి కోసం నిలబడ్డారు. విశాఖలో రాజధాని పేరిట వైసీపీ అక్రమాలు చేస్తుందని విరుచుకుపడుతూ వచ్చారు. ఇప్పటికీ ఆయన స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇలా డేరింగ్‌గా రాజకీయం చేయడమే అయ్యన్నకు ప్లస్ అయింది. అనూహ్యంగా నర్సీపట్నంలో పుంజుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే గణేశ్‌పై వ్యతిరేకత ఇంకా కలిసొచ్చింది. మొత్తానికి నర్సీపట్నంలో అయ్యన్నకు గెలిచే అవకాశాలు  పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. మరొకసారి అయ్యన్నని వైసీపీ నిలువరించడం కష్టమే అని తెలుస్తోంది.