భూమా ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ.!

రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీలపై పోరు మాత్రమే కాదు..సొంత పార్టీల్లో కూడా అంతర్గత పోరు ఉంటుంది. సొంత పార్టీ నేతలే ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి చూస్తారు. ఇప్పటికే అధికార వైసీపీలో అంతర్గత పోరు పీక్స్ లో ఉంది. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ టీడీపీలో కూడా ఉంది. ఇక ఈ సీటు రచ్చ భూమా ఫ్యామిలీలో రాజకీయ చిచ్చుకు కారణమైంది.

కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎన్నో దశాబ్దాల నుంచి భూమా ఫ్యామిలీ కర్నూలులో రాజకీయం చేస్తుంది. అన్నదమ్ములైన భూమా శేఖర్ రెడ్డి, భూమా భాస్కర్ రెడ్డి, భూమా నాగిరెడ్డిలు..జిల్లాలో కలిసి రాజకీయం చేసి..ఫ్యామిలీకి గట్టి పట్టు వచ్చేలా చేశారు. ముగ్గురు నేతలు వరుసపెట్టి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మెలిసి రాజకీయాలు చేసి ఫ్యామిలీని నిలబెట్టారు గాని..వీరి పిల్లలు మాత్రం సెపరేట్ గా రాజకీయాలు చేస్తున్నారు.

భూమా నాగిరెడ్డి వరుసలైన అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, మౌనిక రెడ్డిలది ఒక దారి కాగా, భాస్కర్ రెడ్డి వారసుడు కిషోర్ రెడ్డిది మరొకదరి. అటు శేఖర్ రెడ్డి తనయుడు భూమా బ్రహ్మానందరెడ్డి రూట్ మరొకటి అన్నట్లు ఉంది. వీరిలో మొదట అఖిల రాజకీయాల్లోకి వచ్చారు. శోభా నాగిరెడ్డి మృతితో అఖిల ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యే అయ్యి..ఆ తర్వాత తన తండ్రి నాగిరెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. అటు నాగిరెడ్డి చనిపోవడంతో నంద్యాల ఉపఎన్నికలో బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి గెలిచారు.

2019 ఎన్నికల్లో అఖిల, బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. ఇక ఇప్పుడు సీట్లు విషయంలో ఫ్యామిలీ మధ్య చిచ్చు రేగింది. అఖిల..ఆళ్లగడ్డతో పాటు నంద్యాల కూడా తమదే అంటున్నారు. తాజాగా అక్కడ ఒక ఇల్లు కూడా తీసుకున్నారు. సెపరేట్ గా పార్టీ ఆఫీసు పెట్టారు. కానీ నంద్యాల ఇంచార్జ్ గా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. అయితే రెండు సీట్లు తమ ఫ్యామిలికే కావాలని అఖిల ట్రై చేస్తున్నారు. ఇటు బీజేపీలో ఉన్న కిషోర్ వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ పెంచున్నారు. ఈయన ఆళ్లగడ్డ సీటులో ఉన్నారు. కిషోర్ మళ్ళీ టీడీపీలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికైతే భూమా ఫ్యామిలీలో పోరు పీక్స్ లో ఉంది.